రాంచీ : ఆపరేషన్ సింధూర్‌తో కొత్త తరహా యుద్ధాన్ని జరిపినట్లు సీడీఎస్ అనిల్ చౌహాన్(CDS Anil Chauhan) అన్నారు. ఆ దాడుల సమయంలో పాకిస్థాన్‌ను అన్ని రకాలుగా దెబ్బతీసినట్లు ఆయన చెప్పారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 36 స్కూళ్ల విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ఈ నేపథ్యంలో సీడీఎస్ చౌహాన్ మాట్లాడుతూ..సంప్రదాయ యుద్ధాల తరహాలో కాకుండా ఈసారి ప్రత్యేక శైలిలో యుద్ధం జరిగినట్లు ఆయన చెప్పారు. భూమి, గాలి, నీటిలోనూ వార్ జరిగిందన్నారు. ఎలక్ట్రోమ్యాగ్నటిక్ స్పేస్, సైబర్ డొమెయిన్లను వదలలేదన్నారు. అయితే శాటిలైట్, ఎలక్ట్రానిక్ ఇమేజ్‌లు, సిగ్నల్ ఇంటెలిజెన్స్ ద్వారా మాత్రమే ఈ యుద్ధాన్ని వీక్షించినట్లు చెప్పారు.
ఆపరేషన్ సింధూర్ను రాత్రి ఒంటి గంటకు ప్రారంభించినట్లు సీడీఎస్ తెలిపారు. బోర్డర్స సమీపంలో మరణాల సంఖ్యను తగ్గించాలన్న ఉద్దేశంతో రాత్రి పూట స్ట్రయిక్ చేసినట్లు చెప్పారు.పాక్‌పై జరిగిన తాజ యుద్ధంలో సాంకేతిక పైచేయి సాధించిందన్నారు. టెక్నాలజీలో ఆధునికత, ఆధిపత్యం ఉండడం వల్లే యుద్ధం గెలిచినట్లు తెలిపారు. వాస్తవానికి ఉదయం 5 గంటలకు దాడి చేస్తే బాగుండేది, కానీ, అప్పటికే ముస్లింల అజా ప్రారంభం అవుతుందని, బహవల్పూర్, మురిద్కీపట్టణాలపై ఆ టైంలో దాడి చేస్తే సాధారణ ప్రజల ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని రాత్రి అటాక్ చేసినట్లు చెప్పారు. పాకిస్థాన్ వైపు ఉన్న ఎయిర్ ఆపరేషన్స్ అధ్యయనం చేసిన తర్వాతే తేదీని, సమయాన్ని డిసైడ్ చేసినట్లు తెలిపారు. సుదూరం ఉన్న టార్గెట్‌ను రాత్రిపూట కచ్చితత్వంతో పేల్చాలంటే ప్రత్యేక సామర్థ్యం అవసరం అవుతుందని సీడీఎస్ అనిల్ తెలిపారు.