One Country-One Election Bill | ఒకే దేశం-ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడినట్లు తెలుస్తున్నది. వాస్తవానికి, సోమవారం పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలో రాజ్యాంగం (129వ సవరణ) బిల్లు, కేంద్ర పాలిత ప్రాంత చట్టాల (సవరణ) బిల్లులను సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు జాబితా చేసింది. తాజాగా సవరించిన లోక్‌సభ బిజినెస్ జాబితాలో సోమవారం నాటి ఎజెండాలో ఈ రెండు బిల్లులను తొలగించింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20న ముగియనున్నారు. గురువారం కేబినెట్ రాజ్యాంగ (129వ సవరణ) బిల్లు- 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాలు (సవరణ బిల్లు), 2024కి ఆమోద ముద్ర వేసింది.
ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం బిల్లులకు సంబంధించిన ప్రతులను సభ్యులకు పంపిణీ పూర్తయ్యింది. ఈ క్రమంలో కేంద్రం బిల్లులను ప్రవేశపెడుతుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి జమిలీ ఎన్నికల కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ అధికరణను చేర్చాల్సి రానున్నది. పార్లమెంట్ పదవీకాలంలో మార్పు కోసం 83 అధికరణ, అసెంబ్లీ పదవీకాలం సవరణ కోసం 327 అధికరణను సవరించాల్సి ఉంటుంది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసుల మేరకు రాజ్యాంగ (129వ సవరణ) బిల్లును కేంద్రం రూపొందించిన విషయం తెలిసిందే. ముసాయిదా బిల్లుల ప్రకారం సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ మొదటి సమావేశానికి రాష్ట్రపతి నోటిఫై చేసిన తేదీ నుంచి ఏకకాల ఎన్నికలు అమలులోకి వస్తాయి.
రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం.. ఈ నియమిత తేదీ తర్వాత ఎన్నికైన అన్ని రాష్ట్రాల అసెంబ్లీల పదవీ కాలాలు, లోక్‌సభ పూర్తికాల వ్యవధితో పాటు ముగిసేలా తగ్గిస్తారు. తద్వారా ఏకకాల ఎన్నికలకు మార్గం సుగమమవుతుంది. 2024 లోక్‌సభకు సంబంధించి మొదటి సమావేశం ముగిసిందున.. తదుపరి లోక్‌సభ ఎన్నికలు 2029లో జరుగుతాయి. ఆ లోక్‌సభ తొలి సమావేశంలో రాష్ట్రపతి నోటిఫై చేస్తే.. ఆ లోక్‌సభ పూర్తి పదవీ కాలం ఉంటే 2034లో తొలి విడత జమిలీ ఎన్నికలు జరుగుతాయి. బిల్లు ప్రకారం అసెంబ్లీలకు ఉన్న నిబంధనలు కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, పుదుచ్చేరికి వర్తిస్తాయి. కొత్త జమిలి ఎన్నికల బిల్లు ప్రకారం నిర్దేశిత కాల పరిమితి కన్నా ముందే పార్లమెంట్, రాష్ట్ర, యూటీల అసెంబ్లీలు రద్దయితే, ఆయా అసెంబ్లీలకు, పార్లమెంట్‌కు మిగిలి ఉన్న కాలానికి మాత్రమే మధ్యంతర ఎన్నికలు జరుగుతాయి.