ముంబై, మే 13: కిలో ధర 50 పైసలకు పడిపోవడంతో మహారాష్ట్రలో ఉల్లి రైతులు కన్నీరు పెడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ఉల్లిగడ్డలను నాసిక్‌లోని సతానా తాలుకాలోని సతానా అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)కి తీసుకురాగా, అక్కడ కిలో ధర 50 పైసలు పలకడంలో రైతులు కంగుతిన్నారు. కాగా, మహారాష్ట్ర అంతటా ఇదే పరిస్థితి నెలకొంది. నందగామ్ ఏపీఎంసీకి వచ్చిన రైతులకు అక్కడి ధరను చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2,500 కిలోల ఉల్లిగడ్డలను అక్కడే పారేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. కాగా, మే 8న ట్రాక్టర్ లోడ్‌తో వచ్చిన రైతు జితేంద్ర సోలంకి నాసిక్‌లోని ఏపీఎంసీ వచ్చి అక్కడి రేటును చూసి షాక్ తిన్నాడు.
అతడు తెచ్చిన ఉల్లిగడ్డలను అక్షరాల కిలో 0.50 పైసలు చొప్పున కొనుగోలు చేయడంతో లబోదిబోమన్నాడు. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఏపీఎంసీ అధికారులు నిరాకరించడంలో వేరే గత్యంతరం లేక ఆ ధరకే సరుకును అమ్ముకున్నాడు. ఒకటిన్నర ఎకరాల్లో ఉల్లిగడ్డ పండించడానికి లక్ష రూపాయలు అయ్యిందని, దానిని అమ్మితే 15 వేలు వచ్చాయని, తనకు రూ.85 వేల అప్పు మిగిలిందని వాపోయాడు. మే 2న ఇదే మార్కెట్లో కిలో రూ. 3.50 ధర పలికిందనిచెప్పాడు. కనీసం కిలోకు రూ.20 రాకపోతే రైతుకు ధర గిట్టుబాటు కాదని తెలిపాడు.
ఎర్ర బంగారంగా రైతులు పిలుచుకునే ఉల్లిని ఈ ఏడాది మార్చి ఏప్రిల్‌లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్ల వానలు దారుణంగా దెబ్బతీశాయి. మహారాష్ట్రలోని 44 వేల హెక్టార్లలో ఉల్లి పంట దెబ్బతింది. దానికి తోడు అధికంగా పంట దిగుబడి రావడం వల్ల కూడా ధర బాగా దిగజారిపోయింది.