OROP | సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (OROP) పథకం ప్రకారం రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు చెల్లించే పెన్షన్‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవడంపై జాప్యంపై మండిపడింది. తక్షణం బకాయిలు చెల్లించాలని ఆర్మీని ఆదేశించింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న పెన్షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోనందుకు కేంద్రాన్ని మందలించడంతో పాటు రూ.2లక్షల జరిమానా విధించింది. పెన్షన్ విషయంలో దాఖలైన పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
పదవీ విరమణ చేసిన అధికారుల పెన్షన్ చెల్లింపులో కేంద్రం విఫలమైందన్న సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్ 14 వరకు సమస్యను పరిష్కరించాలని కేంద్రానికి గడువు ఇచ్చింది. లేకపోతే పెన్షన్ పెంపుపై తామే ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందంటూ కేంద్రానికి హెచ్చరికలు చేసింది. పెన్షన్ చెల్లింపులో ఇంకా ఎన్నాళ్లు జాప్యం జరుగుతుందంటూ ప్రశ్నించింది. 2021 నుంచి ఈ వ్యవహారంపై చర్చ జరుగుతోందని.. ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. నవంబర్ 14లోగా తుది నిర్ణయం తీసుకోకుంటే రిటైర్డ్ రెగ్యులర్ కెప్టెన్లకు 10శాతం పెన్షన్ పెంచేలా తామే ఆదేశాలిస్తామని స్పష్టం చేసింది. రూ.2లక్షల మొత్తాన్ని ఆర్మీ సంక్షేమ నిధిలో జమచేస్తామని చెప్పింది. అయితే, కేంద్రం తరఫున విచారణకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భట్టి వాదనలు వినిపించారు.
తాను క్షమాపణలు మాత్రమే చెప్పగలమని.. తమకు మరో అవకాశం ఇవ్వాలన్నారు. మూడు నెలల పాటు అవకాశం ఇస్తే పెన్షన్ విషయంలో నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనాన్ని కోరారు. ఇందులో సమస్యలున్నాయని.. వాటిని పరిశీలించాల్సి ఉందని తెలిపారు. ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని.. మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. మొదట గడువు ఇచ్చేందుకు నిరాకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. చివరగా ఓ అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. కేసు విచారణను ఈ ఏడాది నవంబర్ 25 నాటికి వాయిదా వేసింది.