గువాహటి: బీజేపీ పాలిత అస్సాం గోల్పారాలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు డ్రైవ్ హింసాత్మకంగా మారింది. నిరసనకు దిగిన బెట్బారీ గ్రామస్థులపై పోలీసులు కాల్పులు జరపగా, 19 ఏండ్ల టీనేజర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. దవాఖానలో చికిత్స పొందుతున్న కసుమొద్దీన్ అనే వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలిసింది.
గురువారం పైకాన్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టిన తొలగింపు డ్రైవ్‌కు వ్యతిరేకంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ప్రధానంగా ముస్లిం కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు డ్రైవ్ సాగుతున్నదని వారు ఆరోపించారు. జూలై 12న అధికారులు ఆ ప్రాంతంలోని 1,080 ముస్లిం కుటుంబాల ఇండ్లను కూల్చివేశారు. వారంతా అటవీ ప్రాంతాన్ని ఆక్రమించారని అధికారులు ఆరోపించారు.