Rahul Gandhi | కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేతను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. నిజమైన భారతదేశ పౌరుడు అయితే ఇలాంటి వ్యాఖ్య చేసి వుండేవారు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాకు బదులుగా పార్లమెంట్లో ఆయా అంశాలను ఎందుకు మాట్లాడలేదని నిలదీసింది. అయితే, సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ నిరాధాఱమైన వాదనలు చేసినందుకు సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించిందన్నారు. వేల చదరపు కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందని రాహుల్ చేసిన ప్రకటన దేశానికి హానికరమని.. మన సాయుధ దళాల నైతికతను తగ్గిస్తుందన్నారు. ఇలాంటి నిరాధారమైన ప్రకటనలు చేయొద్దని రాహుల్కు విజ్ఞప్తి చేస్తున్నామని.. అయినా తమ మాట వినడం లేదన్నారు.
కనీసం సుప్రీంకోర్టు హెచ్చరించినందుకు సంతోషంగా ఉన్నానన్నారు. భారతీయుడిగా రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేకూడదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసిందన్నారు. రాహుల్ గాంధీ భారత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మండిపడ్డారు. సైన్యం ధైర్య సాహసాలు ప్రదర్శించి చైనా సైన్యాన్ని వెనక్కి పంపిస్తే.. చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్లో 2వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని చెప్పడం సరికాదన్నారు. నిజమైన భారతీయులైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదని కోర్టు అనడం రాహుల్ గాంధీ విశ్వసనీయతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయనన్నారు. కాంగ్రెస్ నాయకుడిగా ఎంత పరిణితి చెందిన వారని ఆయన ప్రశ్నించారు. చైనా సైన్యం ఆక్రమించిన రాహుల్ గాంధీ భారత వ్యతిరేక మనస్తత్వాన్ని బయటపెట్టడం ఇదే తొలిసారి కాదని విమర్శించారు.
2020 గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణను ఉద్దేశించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చైనా 2వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించిందని, ప్రధాని నరేంద్ర మోదీ దాన్ని సరెండర్ చేశారని ఆరోపించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలపై 2022 డిసెంబర్లో ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆయన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ మాజీ డైరెక్టర్. సైన్యంపై రాహుల్ గాంధీ అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అయితే, ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమి రాహుల్ కొట్టిపడేశారు. ఆ తర్వాత 2023 జనవరిలో జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్లోనూ, చైనా మన భూమిని ఆక్రమించిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి లక్నో కోర్టు సమన్లు జారీ చేసింది.
దాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు. రాహుల్పై లాయర్ వివేక్ తివారీ కేసు దాఖలు చేశారు. రాహుల్ పిటిషన్పై దీనిపై జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఏజీ మసీహ్ల బెంచ్ విచారణ జరిపింది. విచారణ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. 2వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని మీరు ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించింది? మీరు నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరు కదా? అని జస్టిస్ దత్తా ప్రశ్నించారు. మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏమైనా నమ్మదగిన ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నలు సంధించారు. రాహుల్ గాంధీ తరపున వాదించిన న్యాయవాది సింఘ్వీ వాదనలు వినిపించారు. ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని, సైన్యాన్ని అవమానించే ఉద్దేశం రాహుల్కు లేదని తెలిపారు. ఇరువర్గాల వాదనలు సుప్రీంకోర్టు, పరువు నష్టం కేసుపై స్టే ఇచ్చింది. అయితే, రాహుల్ గాంధీ లాంటి నేతలు జాగ్రత్తగా మాట్లాడాలని కోర్టు హెచ్చరించింది.