న్యూఢిల్లీ : భారత్‌లో ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇవాళ ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో నాలుగు చొప్పున ఎనిమిది కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కొత్త స్ట్రెయిన్ కేసుల సంఖ్య 49కి చేరింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 20, రాజస్థాన్‌లో 13, కర్ణాటకలో మూడు, గుజరాత్లో నాలుగు, కేరళ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఢిల్లీలో ఆరు, చండీగఢ్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మరో వైపు కొవిడ్ సంబంధిత ప్రోటోకాల్స్‌ను పాటించడంలో నిర్లక్ష్యంపై ప్రభుత్వం హెచ్చరించింది. అలాగే త్వరగా కొవిడ్ టీకా తీసుకోవాలని సూచించింది. ఇదిలా ఉండగా.. ఢిల్లీలో నాలుగు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. ఒమిక్రాన్ బారినపడ్డ ఓ వ్యక్తి కోలుకొని డిశ్చార్జి అయ్యారని చెప్పారు.