Omar Abdullah : జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని తొలగించింది బీజేపీ సర్కారేనని, ఇప్పుడు ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని బీజేపీ సర్కారును కోరడం మూర్ఖత్వమే అవుతుందని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అగ్ర నేత ఒమర్ అబ్దుల్లా అన్నారు. అయితే ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం తమ డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం తాము పోరాడుతామన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం మారితేనే ఆర్టికల్ 370 పునరుద్ధరణ సాధ్యపడుతుందని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమ ప్రాధాన్యం ఆర్టికల్ 370 కాదని, ప్రజలకు మంచి పాలన అందించడమని, ఈ విషయాన్ని ఎన్నికలకు ముందు కూడా తాను చాలాసార్లు చెప్పానని ఆయన గుర్తుచేశారు. కాగా జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని జమ్ముకశ్మీర్ సర్కారు.. కేంద్ర సర్కారును కోరుతుందా..? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు ఒమర్ అబ్దుల్లా పైవిధంగా స్పందించారు.
జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరు, ప్రమాణ స్వీకారం ఎప్పుడు అనే ప్రశ్నలకు కూడా ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి ఎవరనే విషయాన్ని తమ శాసనసభాపక్షం నిర్ణయిస్తుందని అన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఎవరో నిర్ణయమైన తర్వాతనే ప్రమాణస్వీకారం ఎప్పుడు అనే విసయం వెల్లడి అవుతుందని చెప్పారు. అయితే పైకి ఆయన అలా చెప్పినా కాబోయే సీఎం తానేననే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే తన సొంత పార్టీ నుంచి తాను కూడా మరొకరు ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సే లేదు.