Omar Abdullah : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) సమీపంలోగల బైసరన్ లోయ (Baisaran valley) లో జరిగిన ఉగ్రదాడి (Terror attack) తో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. ఇవాళ ఆ ఉగ్రవాద దాడి జరిగిన ప్రదేశంలో జమ్ముకశ్మీర్ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమైంది. పిరికిపంద చర్యలకు తాము ఏమాత్రం భయపడబోమనే సందేశం టెర్రరిస్టులకు చేరేలా జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈ సమావేశం నిర్వహించింది.
జమ్ముకశ్మీర్‌లోని వేసవి రాజధాని శ్రీనగర్, శీతాకాల రాజధాని జమ్ము కాకుండా వెలుపల ఇలా అక్కడి క్యాబినెట్ భేటీ కావడం ఈ నూతన ప్రభుత్వ హయాంలో ఇదే తొలిసారని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. ప్రకృతి అందాలకు నెలవైన పహల్గాంలోని బైసరన్‌లో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు బలయ్యారు. దాంతో అప్పటి నుంచి పర్యాటకుల రాక తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో పర్యాటకంపైనే ఆధారపడిన స్థానిక ప్రజలకు సంఘీభావంగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు ఒమర్ మీడియాకు వెల్లడించారు.
‘మేం ప్రజల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నాం. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు పహల్గాంకు వచ్చాం. ఆ దిశగా చర్యలు కొనసాగుతాయి’ అని ఒమర్ అబ్దుల్లా అన్నారు. పహల్గాం క్లబ్లో జరిగిన మీటింగ్ దృశ్యాలను ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యలకు ఏ మాత్రం భయపడేదిలేదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇక్కడకు వచ్చామని, జమ్ముకశ్మీర్ దృఢంగా నిలబడుతుందని ఆ పోస్టులో రాసుకొచ్చారు.
కాగా 2009 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఒమర్ అబ్దుల్లా.. ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్, మచిల్, తాంగ్ధర్, జమ్ము ప్రాంతంలోని రాజౌరీ, పూంచ్‌లో ఇలా క్యాబినెట్ సమావేశాలు నిర్వహించారు. ప్రధాని మోదీ అధ్యక్షత వహించే నీతిఆయోగ్ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించాలని అభ్యర్థించారు. ఈ తరహా చర్యలు స్థానిక ప్రజల్లో భయాలను తొలగిస్తాయని విశ్వసిస్తున్నానని చెప్పారు.