Omar Abdullah : జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా రానుందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. రేపటి (ఆగస్టు 5 మంగళవారం)తో ఆర్టికల్ 370ను రద్దు చేసి ఆరేళ్లు పూర్తి అవుతున్నందున కేంద్రం కీలక ప్రకటన చేయనుందనే వార్తలు వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఈ అంశంపై స్పందిస్తూ.. నాకు నమ్మకం ఉంది. అందరూ అనుకుంటున్నట్టు రేపు ఏమీ జరుగదు అని అబ్దుల్లా అన్నారు.
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కట్టబెట్టిన ఆర్టికల్ 370 ని రద్దు చేసి ఆరేళ్లు కావొస్తోంది. 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్‌ను తొలగించి.. జమ్ము కశ్మీర్, లద్ధాఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు(Union Territories)గా ప్రకటించింది. ఈ క్రమంలోనే సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వరుసగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. దాంతో, జమ్ముకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాపైనే చర్చలు జరుగుతున్నాయనే కథనాలు జోరందుకున్నాయి.
I’ve heard every possible permutation & combination about what to expect in J&K tomorrow so let me stick my neck out and say nothing will happen tomorrow – fortunately nothing bad will happen but unfortunately nothing positive will happen either. I’m still optimistic about…
— Omar Abdullah (@OmarAbdullah) August 4, 2025
ఈ నేపథ్యంలో ఆగస్టు 5న కేంద్రం స్టేట్ స్టేటస్‌పై కీలక ప్రకటన చేస్తుందని చాలామంది భావిస్తున్నారు. అయితే.. ఈవార్తల్ని సీఎం అబ్దుల్లా ఖండించాడు. ‘మళ్లీ జమ్ముకశ్మీర్‌కు స్టేట్ హుడ్ ఇస్తారనే వార్తలు నా చెవిన పడ్డాయి. అయితే.. అవి నిజమని నాకైతే నమ్మకం కుదరడంలేదు. రేపు ఏమీ జరగదని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నా. కాకపోతే అసెంబ్లీ వర్షాకాల సమావేశంలోనే ఈ అంశంపై స్పష్టత వస్తుందనే ఆశాభావంతో ఉన్నాను’ అని ఎక్స్ వేదికగా అబ్దుల్లా వెల్లడించారు.