శ్రీనగర్: జమ్ముకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం తొలి సీఎంగా ఒమర్ అబ్దుల్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ము ప్రాంతానికి చెందిన సురేందర్ చౌదరి (Surender Choudhary) డిప్యూటీ సీఎంగా, సకీనా మసూద్, జావేద్ దార్, జావేద్ రాణా, సతీష్ శర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జమ్ము ప్రజల వాయిస్ కోసం, తన ప్రభుత్వాన్ని కలుపుకొని పోయేందుకు నౌషేరాకు చెందిన ఎన్సీ నేత సురేందర్ చౌదరిని డిప్యూటీ సీఎంగా ఎన్నుకున్నట్లు ఒమర్ అబ్దుల్లా తెలిపారు. అందరినీ వెంట తీసుకెళ్లడమే తమ ప్రయత్నమని అన్నారు. ఖాళీగా ఉన్న మూడు మంత్రి పదవులను త్వరలో భర్తీ చేస్తామని చెప్పారు. అయితే కూటమిలో భాగమైన కాంగ్రెస్ పార్టీకి మంత్రి వర్గంలో ఇంకా స్థానం కల్పించలేదు.
కాగా, పీడీపీ, బీజేపీ మాజీ సభ్యుడైన సురేందర్ చౌదరి, జమ్ముకశ్మీర్ బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనాను నౌషేరా నుంచి 7,819 ఓట్ల తేడాతో ఓడించారని ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఈ ప్రభుత్వం తమదేనని జమ్మూ ప్రజలు భావించేందుకే ఈ ప్రాంతానికి చెందిన చౌదరిని ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నట్లు చెప్పారు.
మరోవైపు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నౌషేరా నుంచి పీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సురేందర్ చౌదరిని బీజేపీ అభ్యర్థి రవీందర్ రైనా పది వేల ఓట్ల మార్జిన్‌తో ఓడించారు. 2022లో పీడీపీకి రాజీనామా చేసిన సురేందర్ చౌదరి బీజేపీలో చేరారు. ఏడాదిపాటు ఆ పార్టీలో ఉన్న ఆయన 2023 జూలైలో ఎన్సీలో చేరారు.