భువనేశ్వర్: ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ఆ కుటుంబానికి చెందిన వృద్ధురాలు రెండు రోజుల పాటు వారి శవాలతో అక్కడే నివసించింది. (Old Woman Lived With Corpses Of Family) చివరకు ఆ ఇంటిని వీడి మరో ఊరిలో ఉన్న కుమారుడి వద్దకు వెళ్లింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చౌలియా ఖమర్ గ్రామానికి చెందిన 65 ఏళ్ల పుష్పాంజలి దాస్ తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నది. అయితే 70 ఏళ్ల భర్త శంకర్షన్ ఒక గదిలో, 45 ఏళ్ల కుమార్తె సువర్ణ, 18 ఏళ్ల మనవడు సంతోష్ మరో గదిలో ఉరివేసుకుని కనిపించారు.
కాగా, సీలింగ్‌కు వేలాడుతూ కుళ్లుతున్న కుటుంబ సభ్యుల మృతదేహాలున్న ఆ ఇంట్లో వృద్ధురాలైన పుష్పాంజలి రెండు రోజులు నివసించింది. చివరకు ఫిబ్రవరి 15న ఆ ఇంటి నుంచి ఆమె బయటకు వచ్చింది. దెంకనల్ టౌన్‌కు చేరుకున్నది. కుటుంబ తగాదాల వల్ల 30 ఏళ్లుగా తండ్రి ఇంటికి దూరంగా ఉన్న కుమారుడు ప్రసన్న కుమార్ దాస్ ఇంటికి వెళ్లింది. అతడి తండ్రి, అక్క, ఆమె కుమారుడు మరణించినట్లు చెప్పింది.
మరోవైపు ఈ విషయం తెలిసి ప్రసన్న కుమార్ షాక్ అయ్యాడు. గ్రామంలో తెలిసిన వ్యక్తికి ఫోన్ చేసి ఆ ఇంటికి వెళ్లి చూడమని కోరాడు. ఆ ఇంటి నుంచి దుర్వాసన వస్తున్నదని, ఇక్కడకు రావాలని అతడు చెప్పాడు. దీంతో ప్రసన్న కుమార్ తన తల్లితో కలిసి గ్రామంలోని ఇంటికి చేరుకున్నాడు. తండ్రి, అక్క, మేనల్లుడి మృతదేహాలు రెండు గదుల్లో వేలాడటం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, ఆ ఇంటికి చేరుకున్న పోలీసులు ముగ్గురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా లేక వారిని హత్య చేశారా అన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.