Petrol | హైదరాబాద్, ఆగస్టు 12 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ20 పెట్రోల్) వాహనాలకు మంచిది కాదంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్నది. ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండిస్తోంది. ఇదే విషయమై కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్ కూడా విసిరారు. ఈ క్రమంలో అసలేమిటీ ఈ20 పెట్రోల్? ఎందుకు తీసుకొచ్చారు? దీనిపై వాహనదారుల అభ్యంతరాలేంటి? కేంద్రం సమాధానమేంటి? అనే విషయాలను తెలుసుకొందాం.
80 శాతం పెట్రోల్ (గ్యాసోలైన్), 20 శాతం ఇథనాల్ (బయోఫ్యూయెల్) కలిపిన ఇంధనాన్నే ఈ20 పెట్రోల్‌గా వ్యవహరిస్తున్నారు.
పర్యావరణంలోకి కర్బన ఉద్గారాలను తగ్గించడం, 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్ లక్ష్యాలను చేరుకోవడానికే ఈ20 పెట్రోల్‌ను తీసుకొచ్చినట్టు కేంద్రం పేర్కొంది.
ఈ20 పెట్రోల్ వాడిన వాహనాల్లో మైలేజీ తగ్గిపోతున్నదని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఇంజిన్ సమస్యలు పెరిగాయని వాపోతున్నారు. వాహనాలకు తరుచూ మరమ్మతులు చేయాల్సి వస్తున్నదని, కీలకమైన వాహన విడి భాగాలు దెబ్బతింటున్నాయని, మంథ్లీ మెయింటెనెన్స్ బిల్లులు కూడా పెరిగాయని ఆరోపిస్తున్నారు.
ఈ20 పెట్రోల్‌తో ఎలాంటి ఇంజిన్ సమస్యలు తలెత్తవని కేంద్రం వివరణ ఇచ్చింది. పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ ఎనర్జీ డెన్సిటీ తక్కువగా ఉండటంతో మైలేజీ తగ్గవచ్చని అయితే అది అత్యంత స్వల్పమేనని తెలిపింది. వాహనాన్ని నడిపే విధానం, టైర్లలో గాలి సాంద్రత, ఆయిల్ ఛేంజ్ వంటి మెయింటెనెన్స్ సమస్యలే మైలేజీపై ప్రధానంగా ప్రభావం చూపిస్తాయని గుర్తు చేసింది. మొక్కజొన్న నుంచి వచ్చే బయోవ్యర్థాలను ఈ20 పెట్రోల్ తయారీలో వాడటం వల్ల రైతులకు ఆర్థిక భరోసా కలుగుతుందని పేర్కొంది. ఇథనాల్‌తో మైలేజీ సమస్య వచ్చిన ఒక్క వాహనాన్నైనా తనకు చూపించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఇథనాల్‌ను కలపడం వల్ల వాహనాలకు ఎలాంటి సమస్య రాబోదని తెలిపారు.