న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఆంక్షలు, దిగ్బంధం ఎగుముతులను అడ్డుకోవడంతో ఇరాన్లో ముడి చమురు పేరుకుపోతున్నది. ఇరాన్ చమురు ఉత్పత్తిలో 90 శాతానికి పైగా ఉత్పత్తి చేసి, 3 కోట్ల బ్యారెళ్ల వరకు ముడి చమురును నిల్వ చేయగల ఖర్గ్ ద్వీపంలోని నిల్వ కేంద్రం హొర్ముజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధం కారణంగా నిండిపోయే దశకు చేరుకుంది. ఇప్పుడు ఒక కీలక మలుపు ఆసన్నమైనట్లు కనపడుతుండడంతో అదనపు చమురును సముద్రంలో నిల్వ చేయడానికి ఇరాన్ తన 30 ఏండ్ల నాటి నాషా అనే ట్యాంకర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకువస్తున్నది. అనేక ఏండ్లుగా నిరుపయోగంగా, ఖాళీగా ఉన్న నాషా అనే నౌకను ఇప్పుడు ఎగుమతి చేయలేని అదనపు ముడి చమురును నిల్వ చేయడానికి తేలియాడే నిల్వ కేంద్రంగా తిరిగి వినియోగిస్తున్నది.
ఈ చర్య కేవలం తాత్కాలిక పరిష్కారమే అయినా ఇరాన్ దీనిపై ఆధారపడడం చూస్తే అమెరికా నావికా దిబ్బంధం ఆ దేశ చమురు మౌలిక సదుపాయాలను ఎంత గట్టిగా అడ్డుకుంటున్నదో స్పష్టమవుతున్నది. మరో 1.30 కోట్ల బ్యారెళ్ల చమురుకు మాత్రమే స్థలం ఉందని, నికరంగా లోపలకు వచ్చే చమురు రోజుకు సుమారు 10 లక్షల నుంచి 11 లక్షల బ్యారెళ్ల చొప్పున ఉందని సముద్రయాన విశ్లేషకులు గల్ఫ్ న్యూస్‌కు తెలిపారు. కాబట్టి ఇదే రేటుతో 12 నుంచి 13 రోజుల్లో నిల్వలు నిండిపోతాయని వారు అంచనా వేస్తున్నారు. ట్యాంకర్ ట్రాకర్స్ అనే సముద్రయాన ట్రాకర్ ప్లాట్‌ఫామ్ అందించిన ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఏప్రిల్ 16న ఇరాన్‌లోని ఖర్గ్ ద్వీపంలో ఉన్న ఎగుమతి టెర్మినల్ వద్ద మూడు ట్యాంకర్లు మొత్తం 50 లక్షల బ్యారెళ్ల సరుకును లోడ్ చేస్తున్నట్లు కనిపిస్తున్నది.