భువనేశ్వర్, ఏప్రిల్ 28: సోదరి మరణించినట్టు ఆధారాలు తెమ్మని కోరిన బ్యాంక్ అధికారుల వద్దకు ఒక నిరక్షరాస్య గిరిజనుడు ఏకంగా ఆమె అస్థిపంజరాన్నే బ్యాంకుకు తెచ్చి వారిని హడలెత్తించిన ఘటన సోమవారం ఒడిశాలోని కంజర్ జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఇది బ్యాంక్ అధికారుల వేధింపుల కారణంగా జరిగిందా? లేదా గిరిజనుడి అమాయకత్వం కారణంగా చోటుచేసుకుందా అన్న విషయం అధికారులు పరిశీలిస్తున్నారు. పటానా బ్లాక్‌లోని మలిపోషి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్పాన్సర్ చేస్తున్న గ్రామీణ బ్యాంక్‌లోకి డయానాలి గ్రామానికి చెందిన జీతు ముండా (50) అనే వ్యక్తి చేతిలో ఒక మూటతో ప్రవేశించాడు. ఈ బ్యాంక్‌లో రూ. 20 వేలు దాచుకున్న నా సోదరి కిర్లాముండా (56) మార్చిలో మరణించింది. ఆ డబ్బు నాకివ్వమంటే ఆమె మరణించినట్టు ఆధారాలు తెమ్మన్నారు కదా? ఇదిగో అంటూ మూట విప్పి అందులోని అస్థిపంజరాన్ని బయటకు తీసి చూపించాడు. దానిని చూసిన బ్యాంకు సిబ్బంది హాహాకారాలు చేసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు బ్యాంకుకు చేరుకుని విషయమేమిటో ఆరా తీశారు. అతని సోదరి మరణించినట్టు డెత్ సర్టిఫికెట్ తెమ్మన్నామే తప్ప అస్థిపంజరం కాదని బ్యాంక్ అధికారులు లబోదిబోమన్నారు.
నిరక్షరాస్యత, అజ్ఞానం కారణంగానే జీతు ముండా ఈ విధంగా వ్యవహరించినట్టు గుర్తించిన పోలీసులు అతడిని గ్రామానికి తీసుకువెళ్లి శ్మశానం నుంచి తవ్వితీసిన అతని అక్క అస్థిపంజరాన్ని దగ్గరుండి పూడ్పించారు. అతని సోదరి ఖాతాలోని రూ. 20 వేలు అతడికి చట్టబద్ధంగా అందేలా తగిన సహకారం అందిస్తామని హామీనిచ్చారు.
కేవలం డాక్యుమెంట్లే అడిగాం..
తాజా ఘటనపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అధికారులు వివరణ ఇచ్చారు. తాము నిబంధనల ప్రకారం అతడిని కేవలం సోదరి డెత్ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లు మాత్రమే కోరామని తెలిపారు. అయితే హఠాత్తుగా సోమవారం తన సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు రావడం తమను షాక్‌కు గురిచేసిందన్నారు. జీతు ముండా నిరక్షరాస్యత, అమాయకత్వం, నిబంధనలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని భావిస్తున్నామన్నారు.
మరణించిన సోదరినే తీసుకు రావాలన్నారు
అంతకుముందు బాధితుడు మాట్లాడుతూ ‘నేను చాలాసార్లు బ్యాంక్‌కు వచ్చాను. ఆ ఖాతా ఎవరిపేరు మీద ఉందో వారినే తీసుకురమ్మని బ్యాంక్ సిబ్బంది నాతో చెప్పారు. ఆమె మరణించిందని, నేను ఎంత మొత్తుకున్నా వినలేదు. ఆమెను తీసుకువస్తేనే డబ్బు ఇస్తాం అని మొండిగా అన్నారే తప్ప నా మాట పట్టించుకో లేదు. దీంతో వేరే గత్యంతరం లేక శ్మశానానికి వెళ్లి పూడ్చిపెట్టిన నా సోదని శవాన్ని బయటకు తీసి ఆమె అస్థిపంజరాన్ని మూటలో పెట్టుకుని వచ్చా. ఇంతకన్నా నేనేం చేయగలను చెప్పండి’ అంటూ బాధితుడు మీడియా వద్ద వాపోయాడు.