భువనేశ్వర్, జూన్ 11: తమపై సంవత్సరాల తరబడి అనేకసార్లు లైంగికదాడికి పాల్పడిన ఓ 60 ఏళ్ల కామాంధుడిని కొందరు మహిళలు నరికి చంపి అతని మృతదేహాన్ని తగలబెట్టారు. ఒడిశాలోని గజపతి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు బుధవారం తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 8 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. తమ కుటుంబ సభ్యుడు కనిపించడం లేదని ఓ కుటుంబం ఫిర్యాదు చేయడంతో పోలీసులు గాలింపు మొదలు పెట్టారు. అయితే ఆ వ్యక్తిని నరికి చంపారని, అతని మృతదేహాన్ని కాల్చివేశారని తమకు తెలిసిందని మొహానా పోలీసు స్టేషన్ ఆఫీసర్ ఇన్చార్జ్ బసంత్ సేఠీ తెలిపారు. మృతుడి అస్థికలు, చితాభస్మాన్ని గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని ఓ గుట్ట వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గ్రామ వార్డు సభ్యుడితోసహా 10 మందిని అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు. జూన్ 3వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగిందని, అదే రోజు గ్రామంలో ఓ 52 ఏళ్ల వితంతువును ఆ వ్యక్తి రేప్ చేసినట్లు తెలిసిందని అధికారి చెప్పారు. గతంలో ఆ వ్యక్తి చేత అత్యాచారానికి గురైన బాధిత మహిళలతోసహా కొంతమంది మహిళలు సమావేశమై అతడిని హత్యచేయాలని నిర్ణయించుకున్నారు. అతని ఇంటికి వెళ్లిన మహిళలు ఆరు బయట నిద్రిస్తున్న అతడిని 52 ఏళ్ల బాధిత మహిళ ఇతర మహిళల సాయంతో నరికి చంపింది. ఇద్దరు పురుషులు కూడా మహిళలకు సాయపడ్డారని పోలీసు అధికారి చెప్పారు.
నాలుగేళ్ల క్రితం భార్య మరణించగా అప్పటి నుంచి గ్రామంలోని మహిళలపై అతను అత్యాచారానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ అఘాయిత్యాలకు చరమగీతం పాడాలన్న ఉద్దేశంతోనే అతడిని నరికి చంపామని వారు చెప్పారని ఆయన వివరించారు. కాగా, బాధిత మహిళలు ఎన్నడూ పోలీసు సాయం కోరలేదని జిల్లా ఎస్పీ తెలిపారు.