భువనేశ్వర్, జూన్ 9: ఒడిశా కొత్త సీఎం ఎవరవుతారనే దానిపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. బీజేపీ సీనియర్ నేత, కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సురేశ్ పుజారి ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తున్నది.ఈ క్రమంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకొన్నది. కేంద్ర నాయకత్వంతో చర్చల కోసం ఆయన హస్తినకు వెళ్లినట్టు మద్దతుదారులు చెబుతున్నారు.
ఇంకా సీఎం రేసులో బీజేపీ సీనియర్ నేతలు బైజయంత్ పాండా, అపరాజిత సారంగి, గిరీష్ ముర్ము తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీఎం పోస్టుకు అధినాయకత్వం ఇంకా ఎవరినీ ఎంపిక చేయలేదని, దీనిపై పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోలేదని బీజేపీ ఒడిశా శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ శనివారం ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అన్నారు. మరోవైపు ఈనెల 10కి బదులుగా 12న బీజేపీ సర్కార్ ప్రమాణ స్వీకారోత్సవం ఉంటుందని ఆ పార్టీ నేతలు ఆదివారం వెల్లడించారు.