భువనేశ్వర్: ఆయనో నియోజకవర్గానికి ఎమ్మెల్యే. ఆయనకిప్పుడు 58 ఏండ్లు. బడి మానేసి 40 ఏండ్లు అవుతుంది. అప్పుడెప్పుడే 1978లో పదో తరగతి మధ్యలోనే ఆపేశారు. ఇప్పుడు ఆయనకు చదువుకోవాలనే కోరిక కలిగింది. ఇంకేముంది పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. పెన్ను, ప్యాడ్ పట్టుకుని పది పరీక్షలకు హాజరవుతున్నారు. చదువుకు వయస్సు అడ్డురాదని నిరూపిస్తున్న ఆయన ఒడిశాలోని కంధమాల్ జిల్లా ఫర్బనీ ఎమ్మెల్యే అంగదా కన్హర్.
ఒడిశాలో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. ఈ పరీక్షలకు తన చిన్ననాటి స్నేహితుడు, సర్పంచ్ అయిన సుదర్శన్ కన్హర్ (58)తో కలిసి అంగదా కన్హర్ పరీలు రాస్తున్నారు. శుక్రవారం జరిగిన ఇంగ్లిష్ పేపర్‌ను విజయవంతంగా రాశారు. కాగా, తాను 1978లో చదువు మానేశానని ఎమ్మెల్యే కన్హర్ చెప్పారు. కుటుంబ కారణాలతో పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని తెలిపారు.
ఎమ్మెల్యే అయిన తాను పలు సందర్భాల్లో 50 ఏండ్లు పైబడినవారు కూడా పదో పరీక్షలు రాస్తున్నారని చెప్పానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాను పరీక్షలు ఎందుకు రాయకూడదనే సందేహం కలిగిందని, అందుకే ఇప్పుడు నేను కూడా పరీక్షలు రాస్తున్నాని చెప్పారు. పరీక్షల్లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధిస్తానని నమ్మకం వ్యక్తం చేశారు.