భువనేశ్వర్: సాధారణంగా చేపల కోసం వలవేస్తే చేపలే పడుతాయి. కానీ అప్పుడప్పుడు తాబేళ్లు, కప్పలు, పాములు లాంటివి కూడా వలల్లో చిక్కుతుంటాయి. అయితే తాజాగా ఒడిశాలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడి వలలో ఏకంగా ఒక మొసలి చిక్కింది. భారీ చేపే చిక్కిందనుకుని ఆశతో ఆ వలను పైకి లాగిన జాలరి అందులో మొసలిని చూసి ఖంగుతిన్నాడు. వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు దాన్ని తీసుకెళ్లి సురక్షిత స్థావరంలో వదిలేశారు.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాష్ట్రంలోని తీరప్రాంతమైనా కేంద్రపార జిల్లాకు చెందిన ఓ మత్స్యకారుడు లూనా నదిలో చేపల వేటకు వెళ్లాడు. నదిలో అతను చేపల కోసం వల వేయగా ఐదడుగుల పొడవు ఉన్న ఉప్పునీటి మొసలి చిక్కింది. దాంతో భయపడ్డ మత్స్యకారుడు ఫారెస్ట్ ఆఫీసర్స్‌కు సమాచారం ఇవ్వగా వాళ్లు దాన్ని రక్షించి తీసుకెళ్లారు. ఆ ఉప్పునీటి మొసలి భిటర్‌కనిక నది నుంచి లూనా నదిలోకి ఆహారం కోసం వచ్చి ఉంటదని అటవీ అధికారులు చెప్పారు.
కాగా, గతంలో ఉప్పునీటి మొసళ్ల జనాభా భారీగా తగ్గిపోయిందని అటవీ అధికారులు తెలిపారు. 1975లో వాటి సంఖ్య కేవలం 96 మాత్రమేనని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా సంరక్షణ చర్యలు చేపట్టడంతో ఇప్పుడు వాటి సంఖ్య 1,768కి పెరిగిందని వెల్లడించారు.