Odisha CM : ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. అందులో భాగంగానే ఒడిశా అవుట్ గోయింగ్ ముఖ్యమంత్రి, బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ను కూడా మోహన్ చరణ్ మాఝీ ఆహ్వానించారు.
బుధవారం ఉదయం స్వయంగా నవీన్ పట్నాయక్ నివాసానికి వెళ్లిన మోహన్ చరణ్ మాఝీ.. తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా కాసేపు కూర్చుని ఆయనతో ముచ్చటించారు. అనంతరం నవీన్ పట్నాయక్ నివాసం బయట మోహన్ చరణ్ మాఝీ మీడియాతో మాట్లాడారు. ఈ సాయంత్రం జరగనున్న నా ప్రమాణస్వీకార కార్యక్రమానికి నవీన్ పట్నాయక్ను ఆహ్వానించానని, ఈ సందర్భంగా ఆయన తప్పకుండా హాజరవుతానని చెప్పారని మాఝీ వెల్లడించారు.
ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 స్థానాలు గెలుచుకుంది. అధికార బీజేడీ కేవలం 51 స్థానాలతో సరిపెట్టుకుంది. మిగతా స్థానాల్లో ఇతరులు గెలిచారు. దాదాపు 25 ఏండ్ల నవీన్ పట్నాయక్ సుదర్ఘ పరిపాలనకు తెరపడింది. ఇక మెజారిటీ స్థానాలు దక్కడంతో ఒడిశాలో తొలిసారి బీజేపీ సర్కారు ఏర్పాటు కాబోతోంది.