Odisha Assembly : ఒడిశా అసెంబ్లీ (Odisha Assembly) లో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని నెట్టేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు (Congress MLAs) స్పీకర్ పోడియంపైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రిపోర్టర్స్ టేబుల్‌పైకి ఎక్కి హంగామా చేశారు. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితి అదుపులో లేకపోవడంతో స్పీకర్ (Speaker) సభను వాయిదా వేశారు. కాగా, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల బాహాబాహీకి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సమాధానం చెప్పాలంటూ ప్రతిపక్ష బీజేడీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం మొదలైంది. 1936లో కోసల ప్రాంతాన్ని ఒడిశాలో కలిపేయడం చారిత్రక తప్పిదమని బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ వ్యాఖ్యానించారు. దీనిపై బీజేడీ ఆందోళనకు దిగగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేరుగా ఆందోళన చేశారు. సభ ఆర్డర్లో లేకపోయినా స్పీకర్ క్వశ్చన్ అవర్ కొనసాగించడం.. ఒడిశా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కేసీ మహాపాత్ర సభకు సమాధానం చెబుతుండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే బహినిపతి అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ సజావుగా లేనందున మంత్రి రిప్లే ఇవ్వడం ఆపాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణ్ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే బహినిపతి వైపు దూసుకెళ్లారు. ఆయన కాలర్ పట్టుకుని నెట్టేశారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆగ్రహించారు. రిపోర్టర్స్ టేబుల్ ఎక్కి నానా యాగి చేశారు.