న్యూఢిల్లీ : బాంబు బెదిరింపులతో 11 రాష్ర్టాలను హడలెత్తించిన చెన్నైకి చెందిన ఓ 30 ఏళ్ల రోబోటిక్స్ ఇంజనీర్ చిన్న పొరపాటుతో పోలీసులకు చిక్కింది. తాను ప్రేమించిన వ్యక్తి మరో మహిళను మనువాడాడన్న కోపంతో అతడిని ఇరికించి ప్రతీకారం తీర్చుకోవాలన్న అక్కసుతో ఓ మహిళ ఈమెయిల్ బాంబు బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు కనుగొన్నారు. వీపీఎన్‌ని ఉపయోగించి ఫేక్ మెయిల్ఐడీల ద్వారా అనేక నెలలుగా బాంబు బెదిరింపులు సాగిస్తూ పోలీసుల కళ్లుగప్పిన రేణీ జోషిదా చేసిన చిన్న పొరపాటు పోలీసులను ఆమె ఇంటికి వచ్చేలా చేసింది. చెన్నైలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన జోషిదా ఆ తర్వాత రోబోటిక్స్‌లో కోర్సు చదువుకుంది.
డెలాయిట్‌లో సీనియర్ కన్సల్టెంట్‌గా ఆమె పనిచేస్తోంది. ఓ ప్రాజెక్టు కోసం బెంగళూరు వచ్చిన ఆమెకు దివిజ్ ప్రభాకర్‌తో పరిచయం ఏర్పడింది. మొదటి చూపులోనే అతనితో ప్రేమలో పడింది. అయితే దివిజ్ ఆమెపై ఎటువంటి ఆసక్తి చూపలేదు. ఫిబ్రవరిలో అతనికి వేరే వ్యక్తితో వివాహమైంది. దీంతో రగిలిపోయిన జోషిదా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది. దివిజ్ ప్రభాకర్ పేరిట అనేక నకిలీ ఈమెయిల్ ఐడీలు సృష్టించి స్కూళ్లు, దవాఖానలు, క్రీడా ప్రాంగణాలు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు మెయిల్ చేయడం మొదలుపెట్టింది. తెలంగాణ సహా 11 రాష్ర్టాలకు ఆమె బెదిరింపులు చేసిందని పోలీసులు తెలిపారు.
అహ్మదాబాద్‌లో జూన్ 12న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే కూలిపోగా 274 మంది మరణించిన విషయం తెలిసిందే. మా శక్తి ఏమిటో ఇప్పుడు మీకు తెలిసి వచ్చి ఉంటుందని భావిస్తున్నాను. నిన్న పంపించిన మెయిల్లో చెప్పినట్లే మీ మాజీ సీఎం(విజయ్ రూపానీ)తో వెళుతున్న ఎయిరిండియా విమానాన్ని కూల్చేశాం అని ఆ ప్రమాదం గురించి జోషిదా ఓ మెయిల్ పంపింది. ఇదే ఈ మెయిల్ జోషిదా దగ్గరకు పోలీసులను చేర్చింది. టెక్‌లో నైపుణ్యం గల జోషిదా ఈమెయిల్ ఐడీలు సృష్టించడానికి వర్చువల్ నంబరును ఉపయోగించేదని పోలీసులు చెప్పారు. టోర్ బ్రౌజర్, డార్క్ వెబ్ ద్వారా ఆమె బెదిరింపు ఈమెయిల్స్ పంపేది. అయితే ఆరు నెలల క్రితం ఆమె ఒక పొరపాటు చేసింది. తాను నకిలీ ఈమెయిల్ అకౌంట్ల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ పంపే సిస్టమ్ నుండే తన అసలు ఈమెయిల్‌కు ఆమె లాగిన్ అయింది. దీంతో ఆమె ఐపీ అడ్రస్ బయట పడడంతో పోలీసుల డేగ కళ్లకు ఆమె చిక్కింది. పోలీసులు ఆమెను ఇటీవల అరెస్టు చేశారు.