Fashion Show | శ్రీనగర్, మార్చి 9 : పవిత్ర రంజాన్ మాసం వేళ ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో నిర్వహించడం వివాదంగా మారింది. షోలో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు.
పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని ఫారూక్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనికి బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఫ్యాషన్ షోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సీఎంవో ఎక్స్‌లో స్పందించింది. ‘వారి ఆగ్రహం, దిగ్భ్రాంతి పూర్తిగా అర్థం చేసుకోదగ్గది. దానికి సంబంధించి మేం చూసిన చిత్రాలు స్థానికుల మనోభావాలను దెబ్బ తీసేవి. పైగా రంజాన్ మాసంలో ఇది ఎంతమాత్రం తగనిది. మా కార్యాలయం అధికారులు స్థానిక అధికారులను వివరణ అడిగారు. నివేదిక రాగానే బాధ్యులపై తగిన చర్య తీసుకుంటాం’ అని సీఎంవో పేర్కొంది.