న్యూఢిల్లీ, జూలై 16: బరువు తగ్గటంలో అద్భుత ఔషధంగా భావిస్తున్న ‘టర్జెపటైడ్’ ఔషధం.. త్వరలో భారత్‌లోనూ అందుబాటులోకి రాబోతున్నది. భారత్‌లో ఈ ఔషధం అమ్మకాలకు సంబంధించి ఫార్మా కంపెనీ ‘ఇలి లిల్లీ’కి కేంద్రం త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నది. ఈ ఔషధాన్ని ఇండియాలో టైప్-2 డయాబెటిస్ రోగుల చికిత్స కోసం ప్రధానంగా వాడాలని సూచిస్తున్నా, ఒబెసిటీతో బాధపడుతున్న వారికి దీనిని ఉపయోగించవచ్చునని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ ఔషధాన్ని పెద్ద మొత్తంలో తీసుకున్న రోగుల్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన క్లినికల్ ట్రయల్స్ చెబుతున్నాయి. భారత్‌లోని డ్రగ్ రెగ్యులేటరీ నిపుణుల కమిటీ కొద్ది రోజుల క్రితం ‘టర్జెపటైడ్’ ఔషధం అమ్మకాలకు ప్రాథమికంగా ఆమోదం తెలిపినట్టు సమాచారం.