తిరువనంతపురం: కేరళలోని పతనంతిట్ట జిల్లా తిరువల్లకు చెందిన రంజిత గోపకుమార్ (39) ఇద్దరు పిల్లల తల్లి. బ్రిటన్‌లో నర్సుగా పనిచేస్తున్న ఆమె.. గతంలో కేరళ ప్రభుత్వ ఆరోగ్య సేవల విభాగంలో పనిచేశారు. మెరుగైన అవకాశాల కోసం ఆ ఉద్యోగానికి సెలవు పెట్టి విదేశానికి వెళ్లిన రంజిత.. కొంత కాలంపాటు ఒమన్‌లోని సలాలాలో పనిచేశారు. ఆ తర్వాత బ్రిటన్‌కు వెళ్లి నర్సుగా పనిచేస్తున్న ఆమె ఎన్నో ఆశలతో నాలుగు రోజుల క్రితమే భారత్‌కు తిరిగొచ్చారు. తిరువల్లలో కొత్త ఇంటిని నిర్మించుకుంటున్న రంజిత.. తన పిల్లలను, తల్లిని ఆ ఇంటిలోకి తరలించి వారికి సురక్షితమైన, స్థిరమైన జీవితాన్ని అందించాలని కలలుగన్నారు. వారితో కలిసి హాయిగా జీవించేందుకు మళ్లీ కేరళలో పాత ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా బ్రిటన్‌లో ఉద్యోగాన్ని మానేసి, సంబంధిత పత్రాలను తీసుకునేందుకు సంతోషంగా బయలుదేరిన రంజితను అకాల మృత్యువు కబళించింది. గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె మృతి చెందారు. దీంతో రంజిత తల్లి తులసీకుట్టియమ్మ, పిల్లలు ఇందుచూడన్ (15), ఇతిక (12)తోపాటు ఇద్దరు సోదరులు కన్నీటి సాగరంలో మునిగిపోయారు.
అదే ఆఖరి వీడ్కోలనుకోలేదు!
బైబై అంటూ వీడ్కోలు చెప్పిన కొన్ని గంటలకే తన కుమార్తె ప్రాణాలతో లేదన్న విషయం తెలిసి ఓ తండ్రి గుండెలవిసేలా రోదించడం అందరినీ కలిచివేసింది. అదే తన కుమార్తె ఆఖరి వీడ్కోలు అవుతుందని కలలో కూడా అనుకోలేదని ఆ తండ్రి బోరున విలపించాడు. ఆనంద్ టౌన్‌కు చెందిన సురేశ్ మిస్ట్రీ 21 ఏండ్ల తన కుమార్తె క్రినా మిస్ట్రీకి వీడ్కోలు చెప్పి ఇంటికి రాగానే ఆమె మృతి చెందిందన్న విషయం తెలిసి కుప్పకూలిపోయాడు. తన కుమార్తెకు ఏడాది క్రితమే లండన్‌లో పనిచేయడానికి వర్క్ పర్మిట్ వచ్చిందని, ఇటీవల దంత సర్జరీ చేసుకోవడానికి తన దగ్గరకు వచ్చి తిరిగి లండన్ వెళ్తుండగా, విధి తన కుమార్తెను బలితీసుకుందని ఆయన రోదించాడు. విమానం ఎక్కిన తర్వాత కూడా అంతా ఓకేనని చెప్పడంతో తాను ఇంటికి బయలుదేరానని, తీరా ఇంటికి వచ్చిన తర్వాత ఈ దుర్వార్త తెలిసిందని, తన కుమార్తె ఇక లేదన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని ఆయన తెలిపాడు. తన 21 ఏండ్ల కుమార్తె మృతదేహాన్ని గుర్తు పట్టడానికి దవాఖానలో డీఎన్ఏ శాంపిల్స్ ఇచ్చారు.