Nupur Sharma | మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డ బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసుల్లో అరెస్టుపై స్టే విధించాలని కోర్టును అభ్యర్థించింది. అలాగే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తనపై నమోదైన కేసులను కలిపి విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టు మెట్లెక్కింది. మే నెలలో ఓ టీవీ చానెల్లో మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది.
పలు నగరాల్లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. నూపుర్ శర్మపై దేశవ్యాప్తంగా డజనుకుపైగా ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు కేసు నమోదు చేశారు. గతంలో నూపుర్ శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. చీవాట్లు పెట్టింది. తనకు ప్రాణహాని ఉందని చెప్పినా.. ఊరటనిచ్చేందుకు నిరాకరించింది. వ్యాఖ్య అనంతరం జరిగిన దానికి నూపుర్ మాత్రమే కారణమని కోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్ను ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. ఆ తర్వాత ఆమె తరఫు లాయర్ పిటిషన్ను ఉపసంహరించుకున్నారు.