న్యూఢిల్లీ, జనవరి 4: భారత అణు కార్యక్రమ నిర్మాత రాజగోపాల చిదంబరం శనివారం కన్నుమూశారు. 1974, 1998లో నిర్వహించిన అణు పరీక్షలలో కీలక పాత్ర పోషించిన ఆయన ముంబైలోని జస్లోక్ దవాఖానలో తుదిశ్వాస విడిచినట్టు అణు ఇంధన శాఖ(డీఏఈ) వెల్లడించింది. భారత్ నిర్వహించిన అణ్వస్త్ర కార్యక్రమంలో కూడా చిదంబరం పాలుపంచుకున్నట్టు డీఏఈ తెలిపింది. 2001-2018 మధ్య భారత ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ సలహదారుగా, 1990-93 మధ్య బాబా ఆటామిక్ రిసెర్చ్ సెంటర్ చైర్మన్‌గా, 1993-2000 మధ్య అణు ఇంధన కమిషన్ చైర్మన్‌గా, భారత ప్రభుత్వ కార్యదర్శిగా ఆయన సేవలందించారు.
అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ(ఐఏఈఏ) బోర్డు ఆఫ గవర్నర్స్‌కు చైర్మన్‌గా(1994-95) కూడా ఆయన పనిచేశారు. 1936లో జన్మించిన చిదంబరం చెన్నైలోని పెసిడెన్సీ కాలేజీలో, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. భారతదేశ అణు సామర్థ్యాన్ని తీర్చి దిద్డడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. భారత్ తొలిసారి 1974లో పోఖ్రాన్లో నిర్వహించిన అణుపరీక్షల్లో కీలక భూమిక వహించిన ఆయన, రెండోసారి 1999లో జరిగిన అణు పరీక్షలకు సారథ్యం వహించారు. ఆయన మృతిపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
భారత్ అణు శక్తిగా అవతరించడంలో ఆయన పాత్ర ఎనలేనిది. ప్రపంచ స్థాయి భౌతిక శాస్త్రవేత్తగా అధిక పీడన భౌతిక శాస్త్రం, క్రిస్టల్లోగ్రఫీ, మెటీరియల్ సైన్స్‌లో ఆయన పరిశోధనలు ఆయా రంగాల్లో అవగాహన పెంపొందించుకోవడానికి శాస్త్రవేత్తలకు గణనీయంగా ఉపయోగపడ్డాయి. ఈ రంగాలలో ఆయన చేసిన కృషి భారత్‌లో ఆధునిక మెటీరియల్ సైన్స్ పరిశోధనకు బీజం వేసిందని డీఏఈ పేర్కొంది. అణు రంగంలో ఆయన సాగించిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు అనేక ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయి. 1975లో పద్మశ్రీ, 1999లో పద్మ విభూషణ్ పురస్కారాలతో ప్రభుత్వం గౌరవించింది.