NTA-NEET | ఎంబీబీఎస్ సహా యూజీ వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నీట్ యూజీ, ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లకు జేఈఈ మెయిన్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ను కేంద్రం శనివారం రాత్రి తొలగించింది. నీట్ యూజీ 2024 నిర్వహణలో అవకతవకలు, నీట్ ప్రశ్నపత్రం లీకేజీ జరిగిందన్న ఆరోపణలతో విద్యార్థులు, విపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి. ఆయన స్థానంలో 1985 బ్యాచ్ రిటైర్డ్ అధికారి ప్రదీప్ సింగ్ కరోలాను ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా నియమించింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకూ ప్రదీప్ సింగ్ కరోలా ఆ పదవిలో కొనసాగుతారు.
రెండు ప్రతిష్టాత్మక ప్రవేశ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణల నేపథ్యంలో రెండు నెలలుగా మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా సుబోధ్ కుమార్ సింగ్ మీడియాకు దూరంగా ఉండేవాడని, లో ప్రొఫైల్ లో కొనసాగేవాడని సమాచారం.ఉత్తరప్రదేశ్ కు చెందిన సుబోధ్ కుమార్ సింగ్.. ఐఐటీ రూర్కేలాలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలోని ఇగ్నో యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. గతేడాది జూన్ లోనే ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగం అదనపు సెక్రటరీగా పని చేశారు. ఛత్తీస్ గఢ్ సెక్రటేరియట్ లో 2009-2019 మధ్య పలు హోదాల్లో పని చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారి.