న్యూఢిల్లీ: వాహనాన్ని తనంతట తాను నిర్లక్ష్యంగా, ర్యాష్‌గా నడపటం వల్ల జరిగిన ప్రమాదంలో మరణించిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు నష్టపరిహారాన్ని చెల్లించే బాధ్యత బీమా సంస్థలకు లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. వేగంగా కారును నడిపి, ప్రమాదంలో మరణించిన వ్యక్తి భార్య, కుమారుడు, తల్లిదండ్రులు రూ.80 లక్షలు నష్టపరిహారం కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.
నిరుడు నవంబరు 23న కర్ణాటక హైకోర్టు వీరి పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఎన్ఎస్ రవిష, ఆయన తండ్రి, సోదరి, వారి పిల్లలు కారులో మల్లసండ్ర గ్రామం నుంచి అరసికెరె పట్టణానికి 2014 జూన్ 18న బయల్దేరారు. ఈ కారును రవిష నిర్లక్ష్యంగా నడిపినట్లు, కారు అదుపు తప్పి ప్రమాదం జరిగినట్లు హైకోర్టు గుర్తించింది. రవిష ర్యాష్ డ్రైవింగ్ చేసినందువల్లే ఈ ప్రమాదం జరిగిందని హైకోర్టు తెలిపింది. ఆయనే స్వయంగా తప్పు చేశారు కాబట్టి, ఆయన చట్టబద్ధ వారసులు ఆయన మరణించినందుకు పరిహారాన్ని కోరకూడదని స్పష్టం చేసింది.