భోపాల్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్లోఉత్సాహంగా సాగుతోంది. మో ప్రాంతంలో ఆదివారం రాయల్ ఎన్ఫీల్డ్ నడిపి కార్యకర్తల్లో జోష్ నింపిన రాహుల్ గాంధీ సోమవారం సైక్లిస్ట్‌గా మారారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పూలు చల్లుతుండగా సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు.
పార్టీ కార్యకర్తలు, భద్రతా సిబ్బంది వెంటరాగా సైకిల్ సవారీ చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ వివిధ వర్గాల ప్రజలతో మమేకమవుతున్నారు. ఫుట్‌బాల్ ఆడుతూ, గిరిజనులతో నృత్యం చేస్తూ అన్ని వర్గాల ప్రజలతో కలిసిసాగుతున్నారు. మరోవైపు ఈ యాత్రలో తొలిసాగిగా చిమన్‌బాగ్ మైదానంలో భారత్ జోడో కన్సర్ట్ నిర్వహించారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగనున్న రాహుల్ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ మీదుగా సాగుతోంది. ఇప్పటివరకూ రాహుల్ యాత్ర ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాల మీదుగా మధ్యప్రదేశ్‌కు చేరుకుంది. మోదీ సర్కార్ విధానాలను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రాహుల్ భారత్ జోడో యాత్ర సాగిస్తున్నారు.