శ్రీనగర్: ఎన్నికల తర్వాత కూడా జమ్ముకశ్మీర్‌లో ఏమీ మారలేదని పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్టిజా ముఫ్తీ (Iltija Mufti) విమర్శించారు. తాను, తన తల్లి గృహ నిర్బంధంలో ఉన్నట్లు ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఓదార్చడం కూడా ఇప్పుడు నేరంగా పరిగణిస్తున్నారని మండిపడ్డారు. ‘నా తల్లి, నన్ను ఇద్దరినీ గృహ నిర్బంధంలో ఉంచారు. వసీం మీర్‌ను సైన్యం కాల్చి చంపిన సోపోర్‌ను సందర్శించడానికి ఆమె వెళ్లాల్సి ఉంది. మా ఇంటి గేట్లు మూసేశారు. మఖన్ దిన్ కుటుంబాన్ని కలవడానికి నేను ఇవాళ కథువా సందర్శించాలని అనుకున్నా. బయటకు వెళ్లడానికి నన్ను కూడా అనుమతించడం లేదు. ఎన్నికల తర్వాత కూడా కశ్మీర్లో ఏమీ మారలేదు. ఇప్పుడు బాధితుల కుటుంబాలను ఓదార్చడం కూడా నేరంగా పరిగణిస్తున్నారు’ అని ఎక్స్ పోస్ట్‌లో ఆరోపించారు.
కాగా, గురువారం తెల్లవారుజామున బారాముల్లా జిల్లాలోని చెక్‌పాయింట్ వద్ద లారీ ఆపేందుకు నిరాకరించిన డ్రైవర్ వసీం మజీద్ మీర్‌పై సైన్యం కాల్పులు జరుపడంతో అతడు మరణించాడు. అలాగే ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కథువాలోని బటోడి గ్రామానికి చెందిన 26 ఏళ్ల మఖన్ దిన్, పోలీసుల వేధింపుల కారణంగా బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరోవైపు వీరిద్దరి మరణాలను జమ్ముకశ్మీర్‌లోని పలు రాజకీయ పార్టీల నేతలు ఖండించారు. ఈ సంఘటనలపై దర్యాప్తు జరుపాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ రెండు మరణాలపై దర్యాప్తు చేయడంతోపాటు ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. ప్రజల సహకారం, భాగస్వామ్యం లేకుండా జమ్ముకశ్మీర్‌లో సాధారణ పరిస్థితి సాధ్యంకాదని, ఉగ్రవాద రహితం కాదని అన్నారు.