న్యూఢిల్లీ: ఈ ఏడాది జూన్‌లో జరిగిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంలో పైలట్ ఇన్ కమాండ్‌ను ఎవరూ నిందించలేరని సుప్రీంకోర్టు శుక్రవారం ఆ పైలట్ తండ్రికి తెలిపింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి పైలట్ తప్పిదం కారణమన్న వార్తలపై ఆ పైలట్ తండ్రి వేసిన ఈ పిటిషన్‌పై స్పందన తెలపాలని కేంద్రం, డీజీసీఏ, ఏఏఐబీలకు కోర్టు నోటీసులు పంపింది.
‘విమానం కూలిపోవడం పూర్తిగా దురదృష్టకరం, అయితే ఈ ఘటనకు మీ కొడుకే కారణమన్న నిందను మీరు భరించనక్కర్లేదు’ అని జస్టిస్ సూర్యకాంత్ పిటిషనర్‌తో అన్నారు. ప్రాథమిక నివేదికలోనూ పైలట్‌పై పరోక్ష నిందలేమీ లేవన్నారు. ప్రమాదంలో పైలట్ పాత్ర ఉందని ది వాల్‌స్ట్రీట్ జర్నల్ ఒక వ్యాసం ప్రచురించిందని పిటిషనర్ పేర్కొనగా.. విదేశీ నివేదికలను పట్టించుకోబోమని జడ్జి అన్నారు. ఈ విమాన ప్రమాదంపై స్వతంత్ర న్యాయ కమిటీ దర్యాప్తు అవసరమని పిటిషనర్ లాయర్ అన్నారు.