న్యూఢిల్లీ: గోవాలోని నైట్‌క్లబ్(Goa Nightclub)లో జరిగిన అగ్నిప్రమాదంలో 25 మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ క్లబ్ ఓనర్లు సౌరభ్ లూత్రా, గౌరవ్ లూత్రా.. ప్రమాదం జరిగిన రాత్రే థాయ్‌ల్యాండ్‌కు పరారీ అయ్యారు. ఆ ఇద్దర్నీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అయితే బెయిల్ కోసం లూత్రా సోదరులు ఇవాళ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వాళ్ల తరపున లాయర్ కోర్టులో వాదించారు. ఆ సోదరులు కూడా మనుషులే అని లాయర్ తన పిటీషన్లో వాదించారు. వేల మందికి ఉద్యోగ అవకాశం కల్పించారని, ప్రమాదం జరిగిన సమయంలో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు.
సీనియర్ న్యాయవాది తన్వీర్ అహ్మద్ మీర్ .. లూత్రా సోదరుల తరపున కోర్టులో వాదించారు. రోహిణి కోర్టులో ఆ వాదనలను చేశారు. 5 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోలేదు అని తన పిటీషన్లో లాయర్ వాదించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి పారిపోయిన వ్యక్తులను ఉద్దేశించి లాయర్ తన పిటీషన్లో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అయితే తాత్కాలిక బెయిల్‌కు వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వాదించారు. థాయ్‌ల్యాండ్‌లో లూత్రా సోదరులు వ్యాపారం స్థాపించే ఆలోచనల్లో ఉన్నారని, ఆ ఫోటోల్లో ఇద్దరు స్మైల్ చేస్తున్నట్లు ఉన్నారన్నారు.