ముంబై: అత్తింటి వారు కోడలును టీవీ చూడనీయకపోవడం, కార్పెట్‌పై పడుకోమనడం, పొరుగు వారిని కలవనీయకపోవడం వంటివి క్రూరత్వం కాదని కోర్టు పేర్కొంది. (Bombay High Court) భర్త, అతడి కుటుంబ సభ్యులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను కొట్టివేసింది. మహారాష్ట్రకు చెందిన ఒక మహిళ అత్తింటి వారిపై ఆరోపణలతో భర్తను వీడి పుట్టింటికి చేరింది. 2002 మే 1న ఆమె ఆత్మహత్యకు పాల్పడింది.
కాగా, ఆ మహిళను భర్త, అత్తమామలు వేధించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. టీవీ చూడనీయలేదని, గుడికి వెళ్లనీయలేదని, పొరుగు వారిని కలవనీయలేదని, కార్పెట్‌పై పడుకోబెట్టారని, తెల్లవారుజామున 1.30 గంటకు సరఫరా అయ్యే మంచి నీరు తెప్పించారంటూ పలు ఆరోపణలు చేశారు. ఈ వేధింపులు భరించలేని ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంటూ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన ట్రయిల్ కోర్టు ఆ మహిళ భర్త, అతడి కుటుంబ సభ్యులకు జైలు శిక్ష విధించింది.
అయితే ట్రయిల్ కోర్టు తీర్పును బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్‌లో వారు సవాల్ చేశారు. జస్టిస్ అభయ్ ఎస్ వాఘ్వాసే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ధర్మాసనం వారి పిటిషన్‌పై విచారణ జరిపింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 498A ప్రకారం క్రూరత్వ నేరం కింద ఆరోపించిన ఈ చర్యలు తీవ్రమైనవిగా పరిగణించలేమని కోర్టు తెలిపింది. ఇంటి వ్యవహారాలకు సంబంధించిన ఇవి శారీరక, మానసిక క్రూరత్వం కిందకు రావని పేర్కొంది.
మరోవైపు మహిళ ఆత్మహత్యకు రెండు నెలల ముందు భర్త, అత్తింటి వారితో ఆమెకు ఎలాంటి మాటలు, రాత పూర్వకంగా కమ్యూనికేషన్ వంటివి లేవని కోర్టు గుర్తు చేసింది. దీంతో వారి క్రూరత్వం వల్లనే ఆమె ఆత్మహత్య చేసుకున్నదన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో భర్త, అతడి కుటుంబ సభ్యులకు దిగువ కోర్టు విధించిన శిక్షలను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ కొట్టివేసింది.