Bangladesh : పశ్చిమబెంగాల్ – బంగ్లాదేశ్ (West Bengal – Bangladesh) సరిహద్దుల్లో కంచె (Border Fencing) నిర్మాణం కోసం బీఎస్ఎఫ్ (BSF) కు భూమిని కేటాయిస్తూ పశ్చిమబెంగాల్లోని నూతన ప్రభుత్వం ఇటీవలే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తాజాగా బంగ్లాదేశ్ (Bangladesh) స్పందించింది. ముళ్ల తీగలకు ఢాకా (Dakha) భయపడదని ఆ దేశ విదేశాంగశాఖ సలహాదారు ఎంహెచ్ కబీర్ (MH Kabhir) వ్యాఖ్యానించారు. జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన మీడియా సమావేశంలో చెప్పారు.
అవసరమైనప్పుడు భారత్తో చర్చలు జరుపుతామని కబీర్ అన్నారు. బెంగాల్లో కొత్త ప్రభుత్వం చేసిన ఎన్నికల వాగ్దానాలను తాము గమనిస్తున్నామని అన్నారు. భారత అంతర్గత రాజకీయాల్లో తాము జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని చెప్పారు. తమ సంబంధాలు ప్రధానంగా భారత ప్రభుత్వంతోనే ఉంటాయన్నారు. ప్రస్తుతం సవాళ్లు ఉన్నప్పటికీ.. ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు రెండు దేశాల నాయకత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
ఇదిలావుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత 45 రోజుల్లోనే బంగ్లాదేశ్ వెంబడి ఉన్న సరిహద్దుల్లో కంచె నిర్మాణం చేపడతామని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కంచె నిర్మాణం కోసం బీఎస్ఎఫ్కు భూమిని కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. వచ్చే 45 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.