Manipur Violence | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): ఆయనో కేంద్ర మంత్రి.. పేరు కిషన్‌రెడ్డి.. తనకు తాను గొప్ప మంత్రిగా భావిస్తుంటారు. కేంద్ర టూరిజం శాఖమంత్రిగా క్యాబినెట్ హోదా..ఆయన చేతిలో మరో శాఖ కూడా ఉన్నది.. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ. అంటే దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఏడు రాష్ర్టాల అభివృద్ధి, ఇతర వ్యవహారాలకు సంబంధించిన కీలక శాఖ ఈయన చేతిలోనే ఉన్నది. కానీ మూడు నెలలుగా ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ మంటల్లో కాలిపోతున్నా ఈ మంత్రివర్యుడు పల్లెత్తి మాట పలకలేదు. మణిపూర్‌లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో ఇటీవల బయటకు రావటంతో దేశమంతా ఉడికిపోతున్నది. అయినా, మంత్రికి పట్టలేదు. మాట వరుసకైనా అయ్యో అనలేదు. సాక్షాత్తూ ప్రధాని మోదీయే బెల్లంకొట్టిన రాయిలా మౌనంగా ఉండగా తానెందుకు ఉండకూడదు అనుకొన్నారేమో! ట్విట్టర్ పట్టుకొని వేలాడే కిషన్‌రెడ్డి.. మణిపూర్‌పై ట్విట్టర్లో ఒక్క పోస్టు పెట్టలేదు.
పలాయనం
మణిపూర్ మారణకాండపై ఇటీవల ఓ విలేకరి స్పందించాలని అడిగారు. దేశమంతా అట్టుడుకుతున్నా ఎందుకు స్పందించటం లేదని గట్టిగానే ప్రశ్నించారు. అందుకు సదరు మంత్రి చెప్పిన మాట ఏమిటో తెలుసా? ‘అది నా పరిధిలో లేదు. నన్ను అడుగొద్దు’ అని. ఈ అంశం ఈశాన్య ప్రాంత వ్యవహారాలు చూసే మంత్రి పరిధిలో కాకుండా ఎవరి పరిధిలో ఉంటుందో తెలియక విలేకరి ఒక్క క్షణం తికమక పడ్డారు. మంత్రి ఇంకేమైనా చెప్తారేమోనని మైక్ ఆయన ముందు పెట్టారు. మంత్రికి సర్సున కోపం మైక్‌ను విసురుగా తోసేసి విలేకరిపై గట్టిగా కసురుకున్నారు. ‘మైక్ పెట్టకుండా అడగలేవా? ఆ అంశం నా పరిధిలో లేదని చెప్పాను కదా?’ అని అరిచారు.
అందరూ మౌనమే
మణిపూర్‌లో తెగల మధ్య ఘర్షణ మే 3న మొదలైంది. అప్పటి నుంచి ప్రధాని నుంచి కేంద్ర మంత్రులు, బీజేపీ నేతల వరకు ఏ ఒక్కరూ నోరు విప్ప దానిపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. 56 ఇంచుల ఛాతీ ఉన్న ప్రధాని అని బీజేపీ గొప్పలు చెప్పే నరేంద్రమోదీ హింస మొదలైన 1800 గంటల తర్వాత.. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో స్పందించారు. ఇంతకూ ఆయన చెప్పిన మాట ఏమిటో తెలుసా? ‘మణిపూర్‌లో మహిళలపై దారుణాలకు పాల్పడినవారిని కఠినంగా శిక్షిస్తాం’ అని. 75 రోజుల తర్వాత స్పందించిన ప్రధాని, ఇంతటి దారుణాలపై మాట్లాడింది 30 సెకండ్లు మాత్రమే. ప్రతిపక్షాలపై అంతేసి నోరేసుకొని విరుచుకుపడే కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ.. మణిపూర్‌లో మహిళల నగ్న ఊరేగింపుపై ట్విట్టర్లో ఒక్క పోస్టు పెట్టి చేతులు దులుపుకొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు మణిపూర్‌లో హింసపై దృష్టిపెట్టేందుకు సమయమే చిక్కలేదు. ఘర్షణలు మొదలైన నెల రోజుల తర్వాత కానీ ఆయన అక్కడ పర్యటించలేదు. ఇక మణిపూర్‌లో బీజేపీ సర్కారును నడిపిస్తున్న సీఎం బీరేన్‌సింగ్ తీరైతే మరీ దారుణం. మహిళలను నగ్నంగా రోడ్లపై తిప్పి సామూహిక లైంగికదాడులకు పాల్పడి రెండున్నర నెలలైనా సీఎంగా మీరు తెలుసుకోలేకపోయారా? అని అడిగితే.. ‘ఇలాంటివి రాష్ట్రంలో వందలకొద్ది చోటుచేసుకొన్నాయి.. ఇది ఒక్కటే కాదు’ అని నిస్సిగ్గుగా బదులిచ్చారు. అంటే మణిపూర్‌లో ప్రభుత్వమే లేదని ఆయన పరోక్షంగా చెప్పినైట్టెంది.