Continents | న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రపంచంలో మొత్తం ఎన్ని ఖండాలున్నాయన్న ప్రశ్న ఎవరికైనా ఎదురైతే ఠక్కున 7 అనే సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆఫ్రికా, అంటార్కిటికా, ఆసియా, ఆస్ట్రేలియా, యూరప్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా ఖండాలుగా మన భూగోళం విడిపోయిందని చిన్నప్పుడే చదువుకున్నాం గనుక. కానీ, అందులో నిజం లేదట. వాస్తవానికి భూగోళంపై 7 ఖండాలు లేవని, ప్రస్తుతానికి 6 ఖండాలే ఉన్నాయని నూతన అధ్యయనంలో పరిశోధకులు తేల్చారు. మనం అనుకుంటున్నట్టుగా ఉత్తర అమెరికా, యూరప్ వేరుపడలేదని, అవి ఖండాలుగా విడిపోయే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని డెర్బీ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు.
‘దాదాపు 5.2 కోట్ల ఏండ్ల క్రితం ఉత్తర అమెరికా, యూరేషియా భూ ఫలకాలు (టెక్టానిక్ ప్లేట్స్) విడిపోయినట్టు మనం భావిస్తున్నాం. కానీ, అందులో నిజం లేదు. వాస్తవానికి ఆ భూ ఫలకాలు ఇంకా విడిపోలేదు. అవి విడిపోయే ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతున్నట్టు మా అధ్యయనంలో తేలింది’ అని డాక్టర్ జోర్డాన్ పీథియన్ తెలిపారు. గ్రీన్‌ల్యాండ్ సముద్రానికి, ఉత్తర అట్లాంటిక్ సముద్రానికి మధ్య ఉన్న ఐస్‌ల్యాండ్ ఏర్పాటుపై ఈ అధ్యయనంలో పరిశోధకులు దృష్టి సారించారు. యూరేషియా, ఉత్తర అమెరికా భూ ఫలకాల మధ్య సరిహద్దుగా ఉన్న మిడ్ అట్లాంటిక్ రిడ్జ్ (మధ్య అట్లాంటిక్ శిఖరం) పతనంతో వేడి మాంటిల్ ప్లూమ్ ఏర్పడి కాలక్రమంలో అగ్నిపర్వత ద్వీపంగా మారడంతో దాదాపు 6 కోట్ల ఏండ్ల క్రితం ఐస్‌ల్యాండ్ ఏర్పడినట్టు మనం ఇప్పటివరకు భావిస్తున్నాం.
ఈ సిద్ధాంతాన్ని సవాలు చేసే సాక్ష్యాలు నూతన అధ్యయనంలో బయల్పడ్డాయి. పరిశోధకులు ఆఫ్రికాలోని భూఫలకాల కదలికలను విశ్లేషించారు. తద్వారా ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ ఐస్‌ల్యాండ్ ఫారోస్ రిడ్జ్ (జీఐఎఫ్ఆర్)లో ఉత్తర అమెరికా, యూరప్ ఖండాలకు సంబంధించిన శకలాలు ఉన్నట్టు తేల్చారు. కొత్తగా గుర్తించిన ఈ ఫీచర్‌ను ‘రిఫ్టెడ్ ఓషియానిక్ మాగ్మాటిక్ ప్లాటూ’ అని లేదా సంక్షిప్తంగా ‘రోంప్’ అని పిలుస్తున్నారు.