న్యూఢిల్లీ: జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఎల్ నినో తీవ్రస్థాయికి చేరుకుంటుందని, దీనివల్ల తీవ్ర వాతావరణ పరిస్థితులు తలెత్తే అవకాశాలు మరింత పెరుగుతాయని ఐక్యరాజ్యసమితికి చెందిన వాతావరణ, శీతోష్ణస్థితి సంస్థ శుక్రవారం హెచ్చరించింది. ఎల్ నినో ఇప్పటికే ప్రారంభమైనదని, రాబోయే నెలల్లో ఇది వేగంగా బలపడుతుందని, అందువల్ల దేశాలు దీని ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) పేర్కొన్నది. అనేక ప్రాంతాల్లో కరువు, భారీ వర్షాలు, భూభాగాల్లో వడగాల్పులు, సముద్రాల్లో ఉష్ణ తరంగాల ముప్పు మరింత పెరుగుతుందని తెలిపింది.
డబ్ల్యూఎంవో ఎల్ నినో ఘటనలను బలహీన, మోస్తరు, బలమైన, అత్యంత బలమైన అనే నాలుగు స్థాయిలుగా వర్గీకరించింది. ప్రస్తుతం ఇది మూడో అత్యున్నత స్థాయికి చేరుకొనే అవకాశమున్నదని తెలిపింది. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరార్ధ గోళంలో శరదృతువు సమయంలో ఎల్ నినో మరింత బలపడుతుందని, దాని ప్రభావం ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు విస్తరిస్తుందని అంచనా. అదే సమయంలో భూమధ్యరేఖ అట్లాంటిక్ మహాసముద్ర ప్రాంతం సాధారణం కంటే ఎక్కువ వేడిగా ఉండే అవకాశం ఉన్నది.
జూలై నుంచి సెప్టెంబర్ మధ్య 60 డిగ్రీల దక్షిణ అక్షాంశం నుంచి 60 డిగ్రీల ఉత్తర అక్షాంశం వరకు ఉన్న భూభాగాల్లో అంటే ధ్రువ ప్రాంతాలను మినహాయించి దాదాపు అన్ని జనావాస ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు అత్యధికంగా ఉన్నాయని అంచనా. జూలై నుంచి సెప్టెంబర్ వరకు వర్షపాతం అంచనాలు కూడా ఎల్ నినో బలపడే పరిస్థితులకు అనుగుణంగానే ఉన్నాయి. అమెరికా నైరుతి ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.