ముంబై, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మంగళవారంతో ముగిసింది. అయితే 15 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులపై పార్టీల్లో ఇంకా స్పష్టత కొరవడింది. అధికార బీజేపీ, శివసేన, ఎన్సీపీ (అజిత్ పవార్) వర్గంలో నాలుగు సీట్లకు ఇంకా అభ్యర్థులను ప్రకటించ లేదు. ఇక విపక్ష మహా వికాస్ అఘాడీలోని శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరద్ పవార్) పార్టీలు 11 స్థానాల్లో అభ్యర్థుల ప్రకటనపై మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఇప్పటివరకు బీజేపీ 152, అజిత్ పవార్ ఎన్సీపీ 52, ఏక్ నాథ్ షిండే శివసేన 80 సీట్లలో అభ్యర్థులను రంగంలోకి దించింది. ఇందులో చిన్న పార్టీలకు చెందిన వారు కూడా ఉన్నారు. అలాగే ఎంవీఏలో కాంగ్రెస్ 103, ఉద్ధవ్ ఠాక్రే శివసేన 87, శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. ఇంకా 11 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అయితే వాటిలో కొన్ని సమాజ్ వాది పార్టీ లాంటి మిత్రపక్షాలకు కేటాయించవచ్చని ప్రచారం జరుగుతున్నది.