నోయిడా, ఆగస్టు 24: బీజేపీ పాలిత యూపీలో మరో దారుణం చోటు చేసుకుంది. రూ.36 లక్షల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేసిన భర్త తన తల్లిదండ్రులతో కలిసి భార్యపై పెట్రోలు పోసి నిప్పంటించి సజీవ దహనం చేసిన ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. జుట్టుపట్టుకుని ఈడ్చుకొచ్చిన భర్త, అత్తింటి వారు.. ఆమె కుమారుడు, సోదరి ఎదుటే ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త, అత్తను అరెస్ట్ చేసి, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. బాధితురాలి సోదరి కూడా ఆ ఇంటి కోడలే. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. గ్రేటర్ నోయిడాలోని సిర్సా గ్రామంలో నివసించే విపిన్కు నిక్కీని ఇచ్చి 2016లో భారీ కట్నకానుకలతో వివాహం చేశారు. వారికి ఆరేండ్ల కుమారుడు సంతానం.
నిక్కీ అక్క.. విపిన్ సోదరుడిని వివాహం చేసుకోవడంతో ఆమె కూడా అదే ఇంటిలో ఉంటుంది. ఇటీవల విపిన్ స్కార్పియో కారు, తర్వాత బుల్లెట్ బైక్ అడిగాడని, రెండూ కూడా కొన్నానని బాధితురాలి తండ్రి తెలిపారు. ఇటీవల ఆయన మెర్సిడీస్ బెంజ్ కొనడంతో విపిన్కూ కూడా ఆశపుట్టి, తాను దానిని కొనడానికి రూ.36 లక్షల అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేస్తూ వచ్చాడు.
ఈ క్రమంలో గురువారం రాత్రి నిక్కీని భర్త, అత్తమామలు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దృశ్యాన్ని మృతురాలు సోదరి సెల్ఫోన్లో వీడియో తీసింది. కాస్నా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను ఎన్కౌంటర్ చేయాలని, బుల్డోజర్తో వారి ఇంటిని కూల్చివేయాలని బాధితురాలి తండ్రి యోగి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.