PM Modi : దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, అధునాతనంగా నిర్మించిన ఉత్తర ప్రదేశ్, నోయిడాలోని నూతన ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ఎయిర్పోర్ట్ ద్వారా రైతులు, వ్యాపారులకు మేలు జరగడంతోపాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో యూపీ సీఎం ఆదిత్యయోగినాథ్, సివిల్ ఏవియేషన్ మినిష్టర్ రామ్ మోహన్ నాయుడు, అతిథులు పాల్గొన్నారు. నోయిడాలోని జెవార్‌లో ఈ ఎయిర్పోర్ట్ నిర్మితమైంది.
దీని ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ మాట్లాడారు. ‘‘ఈ ఎయిర్పోర్ట్ భారతీయ స్ఫూర్తికి నిదర్శనం. ఇది యూపీలో ఆర్థిక ప్రగతికి సహకరిస్తుంది. సమీప ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. యూపీ పశ్చిమ ప్రాంతంలోని రైతులు, యువతకు మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది. అలీగఢ్, ఆగ్రా, మధుర, ఘజియాబాద్, మీరట్, ఎటావా, బులంద్‌షహర్ ప్రాంతాలకు లబ్ధి కలుగుతుంది. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ప్రతి రెండు నిమిషాలకో విమానం ఎగురుతుంది. ప్రపంచం అంతటికీ చేరుకోవచ్చు’’ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రారంభమైంది ఈ ఎయిర్‌పోర్ట్‌లోని ఫేజ్ 1 మాత్రమే. గ్లోబల్ కనెక్టివిటీని పెంచేందుకు ఇది ఉపయోగపడనుంది. దీనికోసం రూ.11,200 కోట్లు ఖర్చయ్యాయి. ఇది మల్టీ మోడల్ హబ్ ఎయిర్‌పోర్ట్‌గా చెప్పుకోవచ్చు. ఇటు ప్యాసింజర్లకు, అటు కార్గో సేవలకు కూడా ఉపయోగపడుతుంది. సంవత్సరానికి 12 మిలియన్ల మంది ప్యాసింజర్లు.. అంటే ఒక కోటి 20 లక్షల మంది ప్రయాణికులు ఇక్కడ్నుంచి వెళ్లేందుకు వీలుగా దీన్ని నిర్మించారు.
ఇందులో హైటెక్ నావిగేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 3,900 మీటర్ల రన్‌వే ఉంది. ఇంటర్నేషనల్ కనెక్టివిటీతోపాటు రీజనల్ కనెక్టివిటీ కూడా పెరగనుంది. ఇది ఇప్పటికే సమీపంలోనే ఉన్న ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌తో కలిపి సేవలు అందిస్తుంది. 45 రోజుల్లోగా ఇక్కడ్నుంచి విమానయాన సేవలు ప్రారంభమవుతాయి. ముందుగా ప్రాంతీయ విమానాల్ని మాత్రమే నడుపుతారు. ఈ ఏడాది చివరి నుంచి అంతర్జాతీయ విమానాలు నడుపుతారు. త్వరలో డొమెస్టిక్ సేవలే నడుస్తాయి కాబట్టి, ఇండిగో, ఆకాశ ఎయిర్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వంటి సంస్థలు ముందుగా విమానాల్ని నడుపుతాయి. ఇక్కడ్నుంచి దేశంలోని పది ప్రధాన నగరాలకు విమానాలు ప్రారంభవుతాయి.