TVK meet : పుదుచ్చేరి (Puducherry) లో టీవీకే పార్టీ చీఫ్ (TVK chief) విజయ్ (Vijay) నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు అక్కడి పోలీసులు అనుమతి మంజూరు చేశారు. రేపు (మంగళవారం) ఉప్పాలం (Uppalam) లోని ఎక్స్పో గ్రౌండ్ (Expo ground) లో సభ జరగనుంది. అయితే పుదుచ్చేరి పోలీసులు సభకు అనుమతి ఇచ్చినా.. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కొన్ని షరతులు విధించారు.
పోలీసులు విధించిన షరతుల మేరకు విజయ్ సభా వేదికపై నుంచి కాకుండా ప్రచారం రథంపై నుంచే మాట్లాడనున్నారు. సభకు 5 వేల మందికి మించి హాజరు కాకూడదు. చిన్నారులు, గర్భిణి మహిళలు, వృద్ధులను ఈ సభకు అనుమతించకూడదు. ఈ నిబంధన మేరకు పార్టీ 5 వేల మందికి మాత్రమే ఎంట్రీ పాసులు ఇవ్వాలి. పాసులు ఉన్నవాళ్లు మాత్రమే సభకు రావాలి. ఈ షరతుల నేపథ్యంలో పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాలకు చెందిన వారు సభకు రావద్దని టీవీకే కోరింది.
సభా నిర్వాహకులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయ్ ప్రచార రథం సోమవారం రాత్రి పుదుచ్చేరికి చేరుకోనుంది. విజయ్ మంగళవారం ఉదయం 11 గంటలకు కారులో సభాస్థలికి చేరుకుంటారు. సభకు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం మొదలుపెట్టనున్నారు.