న్యూఢిల్లీ, అక్టోబర్ 6: వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి ఈసారి ముగ్గురిని వరించింది. అమెరికాకు చెందిన మేరీ ఈ బ్రంకోవ్, ఫ్రెడ్ రామ్స్డెల్, జపాన్‌కు చెందిన షిమోన్ సకాగుచి.. వైద్యశాస్త్రంలో ఆవిష్కరణలకు గాను ఈ ఏడాది నోబెల్ బహుమతి అందుకోనున్నారు. ఈ ముగ్గురు మా నవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ తన సొంత అవయవాలపై దాడి చేయకుండా ఎలా నిరోధిస్తుందో వివరించే ఆవిష్కరణలను కనుగొన్నారు. అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పట్టా పొందిన మేరీ ఈ బ్రంకోవ్ (1961 జననం) ప్రస్తుతం సియాటిల్‌లోని ఇన్స్టిట్యూట్ ఫర్ సి స్టమ్స్ బయాలజీలో సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. లాస్ ఏంజిలిస్‌లోని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి 1987లో పీహెచ్డీ పట్టా పొందిన ఫ్రెడ్ రామ్స్డెల్ (1960 జననం) ప్రస్తుతం శాన్ఫ్రాన్సిస్కోలోని సొనోమా బయోథెరాప్యూటిక్స్లో సైంటిఫిక్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. ఇక 1951లో జన్మించిన షిమోన్ సకాగుచి జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ నుంచి 1983లో పీహెచ్డీ పట్టా పొందారు. ఆయన ప్రస్తుతం ఒసాకా యూనివర్సిటీలో ఫ్రాంటియర్ రిసెర్చ్ సెంటర్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
ఏమి కనుగొన్నారు?
ఈ ముగ్గురు వైద్య నిపుణులు పరిధీయ రోగనిరోధక శక్తిపై పరిశోధనలు సాగించారు. మానవ శరీరంలోని ‘టీ’ కణాలుగా పేర్కొనే ఓ ప్రత్యేక తరగతికి చెందిన రోగనిరోధక కణాలు ఆటోఇమ్యూన్ వ్యాధికి వ్యతిరేకంగా సంరక్షకులుగా పనిచేస్తున్నట్టు వీరు కనుగొన్నారు. ప్రతిరోజు కొన్ని వేల సంఖ్యలో దాడిచేసే సూక్ష్మజీవుల నుంచి శరీరంలోని రోగనిరోధకశక్తి మనలను కాపాడుతూ ఉంటుంది. అయితే కొన్ని వ్యాధికారక కణాలు శరీరంలోని టీ కణాలను పోలి ఉంటూ తప్పించుకుంటూ ఉంటాయి. దీంతో రోగనిరోధకశక్తి వాటిని గుర్తించలేక కొన్నిసార్లు సొంత కణాలపైనే తన శక్తిని ప్రయోగిస్తూ వాటిని అంతం చేస్తుంటుంది. వైద్యశాస్త్రంలో సుదీర్ఘకాలంగా వేధిస్తున్న ఈ సమస్యకు ముగ్గురు నోబెల్ బహుమతి గ్రహీతలు పరిష్కారాన్ని కనుగొన్నారు. పరిధీయ రోగనిరోధక వ్యవస్థ వెనుక ఉన్న పనితీరును, స్వీయహానిని నివారించే రోగనిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని వెలికితీశారు. ఈ ముగ్గురు శాస్త్రవేత్తల పరిశోధన రోగ నిరోధక శక్తికి సంబంధించిన వ్యాధులపై పోరాడటానికి కొత్త రూపాన్ని ఇచ్చిందని నోబెల్ కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఆటోఇమ్యూన్, ఇన్ఫ్లమేటరీ వ్యాధుల బారిన పడుతున్న లక్షల మందికి వీరి పరిశోధన ఆశాదీపంగా నిలిచిందని వివరించింది.