Jammu and Kashmir : జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) భద్రతా చరిత్రలో ఒక చారిత్రక మైలురాయి నమోదైంది. గడిచిన మూడు దశాబ్దాలకుపైగా కాలంలో తొలిసారిగా, ఉగ్రవాద సంబంధిత హింసలో ఒక్క మరణం కూడా నమోదు కాకుండా ఒక నెల గడిచింది. జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. సౌత్ ఏషియా (South Asia) టెర్రరిజం పోర్టల్ (Terrorism Portal) వంటి స్వతంత్ర ట్రాకర్లతోపాటు అధికారిక గణాంకాలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన నివేదికల ప్రకారం.. ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో కేవలం 12 ఉగ్రవాద సంబంధిత మరణాలు మాత్రమే సంభవించాయి. అందులో 10 మంది ఉగ్రవాదులు, ఒక భద్రతా సిబ్బంది ఉన్నారు. ఈ కాలంలో ఒక్క సామాన్యుడు కూడా ప్రాణాలు కోల్పోలేదు. గతంతో పోలిస్తే ఇది చాలా మెరుగైన పరిస్థితి. ఇక ఈ మే నెలలో ఎలాంటి ఉగ్రవాద సంబంధ మరణం చోటుచేసుకోలేదు. ఉదాహరణకు 2001 మే నెలలో దాదాపు 300 మంది, 2025 మే నెలలో 43 మంది ప్రాణాలు కోల్పోయారు.
భద్రతా బలగాలు నిరంతరాయంగా చేపడుతున్న కౌంటర్-టెర్రరిజం ఆపరేషన్లు, నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడం, ఉగ్రవాదులకు స్థానిక మద్దతు తగ్గడం వంటి కారణాలవల్లే ఈ మార్పు సాధ్యమైందని అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా 2025 ఏప్రిల్లో పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి తర్వాత భద్రతను కట్టుదిట్టం చేసి, ఉగ్రవాద నెట్వర్క్లను ఛేదించడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఉగ్ర మరణాలులేని నెలగా 2026 మే నిలవడం శాంతి, స్థిరత్వం దిశగా ఒక సానుకూల సంకేతమని నిపుణులు భావిస్తున్నారు.