న్యూఢిల్లీ, మే 19: ప్రభుత్వ సంస్థలు, రద్దీగా ఉండే బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలంటూ 2025 నవంబర్లో తాను జారీచేసిన ఆదేశాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. పలు విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఆ తీర్పును సవరించడానికి గానీ, నీరుగార్చడానికి గానీ కోర్టు నిరాకరించింది. అవసరమైతే రేబిస్ వ్యాధి సోకినట్లుగా, నయం చేయలేనివిగా భావించిన వీధి కుక్కలకు కారుణ్య మరణం కలిగించడానికి ప్రభుత్వం వెనుకాడకూడదని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
బహిరంగ ప్రదేశాల్లో నిర్బల వర్గాలు ఎదుర్కొంటున్న కఠోర వాస్తవాలను న్యాయవ్యవస్థ విస్మరించకూడదని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజరియాతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పౌరులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కూడా కోర్టు పేర్కొన్నది.