ముంబై : మైనారిటీ విద్యా సంస్థల్లో ప్రథమ సంవత్సరం జూనియర్ కాలేజ్ అడ్మిషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లను అమలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు గురువారం నిలిపేసింది. దీనిపై సమాధానాన్ని సమర్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాలు గడువు ఇచ్చింది. ఆ తర్వాత రెండు వారాల్లో స్పందించాలని పిటిషనర్లను ఆదేశించింది.
తదుపరి విచారణ ఆగస్టు 6న జరుగుతుందని తెలిపింది. ప్రభుత్వ న్యాయవాది నేహా భిడే వాదనలు వినిపిస్తూ, మైనారిటీల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం స్పృశించలేదన్నారు. మైనారిటీలు తమకు గల అన్ని సీట్లను భర్తీ చేసుకోవచ్చునని, ఖాళీ సీట్లను సరెండర్ చేసే దశలో మాత్రమే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల అంశం వస్తుందని చెప్పారు. సరెండర్ చేసిన సీట్లకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు.