న్యూఢిల్లీ: వివాదాస్పద ఐఏఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ పూజా ఖేద్కర్(Puja Khedkar)కు.. ముందస్తు బెయిల్ మంజూరీ చేసేందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో తప్పడు రీతిలో ఓబీసీ, దివ్యాంగ కోటాను వాడుకున్నట్లు ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. యూపీఎస్సీలోని సభ్యులు ఎవరైనా పూజా ఖేద్కర్‌కు సాయం చేశారా అన్న కోణంలో విచారణ చేపట్టాలని అదనపు సెషన్స్ జడ్జి దేవేంద్ర కుమార్ ఆదేశించారు. ఈ కేసులో విచారణ మరింత విస్తృతం చేయాలన్నారు. యూపీఎస్సీ రిక్రూట్మెంట్ సమయంలో ఎవరైనా ఓబీసీ, దివ్యాంగ కోటాను తప్పుడు రీతిలో వాడుకున్నారో లేదో దర్యాప్తు చేయాలని జడ్జి తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
పూజా ఖేద్కర్ అభ్యర్ధిత్వాన్ని బుధవారం యూపీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో మరోసారి పరీక్ష రాయకుండా కూడా ఆమెపై నిషేధం విధించారు. పూజా ఖేద్కర్ దాఖలు చేసిన అప్లికేషన్ వాదనలు విన్న జడ్జి బుధవారం తన తీర్పును రిజర్వ్ చేశారు. తనను తక్షణమే అరెస్టు చేస్తారని, అందుకే తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో ఆమె పిటీషన్ వేశారు. అయితే యూపీఎస్సీ బోర్డు తరపున వాదించిన ప్రాసిక్యూషన్.. పూజా ఖేద్కర్ దాఖలు చేసిన పిటీషన్‌ను కొట్టివేశారు. మొత్తం వ్యవస్థను చీటింగ్ చేశారని ప్రాసిక్యూషన్ పేర్కొన్నది.