చెన్నై: బహిష్కరించిన ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్)కు పార్టీలో ఎలాంటి స్థానం లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే పళనిస్వామి (K Palaniswami) అన్నారు. పార్టీలోకి ఆయనను తిరిగి తీసుకునే అవకాశం లేదని తెలిపారు. ఓపీఎస్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పళనిస్వామి స్పందించారు. సోమవారం దివంగత సీఎం జయలలిత 77వ జయంతి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే కార్యకర్తలకు ఆదివారం ఆయన లేఖ రాశారు. ‘తోడేలు, గొర్రెలు కలిసి జీవించగలవా? కలుపు మొక్కలు, మొక్కలు పంటలో భాగం కాగలవా? విశ్వాసపాత్రుడు, ద్రోహి భుజం భుజం కలిపి నిలబడగలరా? మీ దృఢమైన సమాధానం నాకు వినిపిస్తోంది’ అని అందులో పేర్కొన్నారు.
కాగా, అన్నాడీఎంకేలోకి తిరిగి రావడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఇటీవల తెలిపారు. అయితే పార్టీలో సర్వశక్తిమంతుడైన ప్రధాన కార్యదర్శి పదవిని కార్యకర్తలే ఎన్నుకోవాలని పట్టుబట్టారు. ‘నేను, టీటీవీ దినకరన్, శశికళ (అన్నాడీఎంకే నుంచి బహిష్కృతులు) ఎలాంటి షరతులు లేకుండా అన్నాడీఎంకేతో ఏకం కావడానికి సిద్ధంగా ఉన్నాం. చర్చల ద్వారా సమస్యలను మేం పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. అన్నాడీఎంకే కార్మికుల హక్కుల పునరుద్ధరణ కమిటీకి పన్నీర్‌సెల్వం నాయకత్వం వహిస్తున్నారు.