West Bengal : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి అక్రమంగా ఎవ్వరూ చొరబడలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక్కరిని కూడా అక్రమంగా రానివ్వబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హుగ్లీ జిల్లా, బాలాగర్లో గురువారం జరిగిన ప్రచార కార్యక్రమంలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే ఒక్కరిని కూడా అక్రమంగా చొరబడనివ్వం. ఇప్పటికే ఉన్న అక్రమ చొరబాటుదారుల్ని గుర్తించి, పంపించివేస్తాం. బెంగాల్ ఆర్థిక వ్యవస్థకు, భద్రతకు అక్రమ వలసదారులు హాని కలిగిస్తున్నారు. రాష్ట్ర యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు, రేషన్ వంటివి దోపిడీ చేస్తున్నారు. దేశ భద్రతను దెబ్బతీసేందుకు కుట్ర పన్నుతున్నారు. మీరు ఇప్పుడు ఓటు వేయబోయేది ఒక ఎమ్మెల్యే కోసమో.. బీజేపీ ప్రభుత్వం కోసమో కాదు. అక్రమవలసదారుల నుంచి రాష్ట్ర విముక్తి కోసం కూడా. ఈ రోజు బెంగాల్ తొలి దశ ఎన్నికలు ముగుస్తున్నాయి. ఇది బెంగాల్లో నా 30వ ప్రచార సభ. రెండో దశ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఓటు వేయండి. మే 5న దీదీ ఆట ముగుస్తుంది. పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుంది’’ అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.
గురువారం పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ తొలిదశ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు 89 శాతం ఓటింగ్ నమోదైంది. దీంతో పూర్తి ఎన్నిక ముగిసే సరికి ఇంకా భారీ ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. రెండో దశ ఎన్నికలు ఈ నెల 29న జరుగుతాయి. మే 4న ఫలితాలు విడుదలవుతాయి.