బెంగళూర్: కృత్రిమేధ అన్ని రంగాల్లోకి శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (సీజేఐ) కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాలంటే అంతర్గత పరిమితులపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. శనివారం బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఏఐ గురించి భయపడొద్దని న్యాయాధికారులకు సూచించారు. ‘టెక్నాలజీ సలహాలు ఇవ్వడంలో ఉపయోగపడుతుంది. మనుషులకు ప్రత్యామ్నాయం కాదు. న్యాయవ్యవస్థలో ఏఐ అనుసంధానం చేయాలంటే సమతుల్యతను పాటించాలి. ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, మానవ మేధస్సు అనుభవాన్ని ఉపయోగించాలి’ అని సీజేఐ అన్నారు.